హైదరాబాద్, సెప్టెంబర్ 2: సైబర్ నెరగాళ్ళకు మనం చేస్తున్న ఉద్యోగంతో ఎలాంటి సంబంధం ఉండదు. మన ఫోన్ నెంబర్ తో పాటు మనకి వాట్సప్ ఉంటే చాలు.. ఈజీగా దోచేస్తారు. గడచిన ఐదు సంవత్సరాల్లో అవిపరితంగా పెరిగిన సైబర్ నేరాల బాధితుల ప్రొఫెషన్స్ చూస్తే నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. బాధితులుగా ఎక్కువగా చదువుకున్న వారు, హై ప్రొఫైల్ ఉద్యోగాలు చేస్తున్నవాళ్లే ఉండటం విశేషం. జరుగుతున్న నేరాలపై ఎంత అవగాహన ఉన్నా సరే సైబర్ నేరస్తులు వేస్తున్న వలకు చదువుకున్న వారు సైతం బాధితులుగా మారిపోతున్నారు.
తాజాగా హైదరాబాదులో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ను సైబర్ నేరగాళ్లు మోసగించారు. ఏకంగా రూ.43.7 లక్షలు అతని నుండి దోచుకున్నారు. ఈ ఏడాది జూన్లో తన మొబైల్ కి వచ్చిన ఒక లింకును క్లిక్ చేయడంతో ఆర్థోపెడిక్ డాక్టర్ బాధితుడుగా మారిపోయాడు. సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ (g3) పేరుతో వచ్చిన ఒక వాట్సాప్ లింక్ ను డాక్టర్ క్లిక్ చేశాడు. అందులో ట్రేడింగ్ కి సంబంధించిన ప్రమోషన్ తో పాటు ఇతర గ్రూప్ సభ్యులు తమ సక్సెస్ స్టోరీని షేర్ చేస్తున్న ఒక టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయిపోయాడు. అందులో ఉన్న కథలను నిజం అనుకొని నమ్మిన డాక్టర్ తాను కూడా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. ఈ గ్రూపులో ఇచ్చిన సలహాల ఆధారంగా షేర్లను 50% డిస్కౌంట్ కే పేమెంట్ అంటూ ఆఫర్ ప్రకటించారు. ఇది నిజమేమో అని అనుకోని నమ్మిన బాధితుడు 50% డిస్కౌంట్ కి ఎక్కువ షేర్లను కొనుగోలు చేశాడు. అయితే మొదట అతడికి ప్రాఫిట్ సైతం సైబర్ నేరగాళ్లు చూపించారు. డబ్బులు వస్తున్నాయని ఆనందంతో రెండు నెలల వ్యవధిలో సుమారు రూ.50 లక్షలకు పైగా నగదును ట్రేడింగ్ చేశాడు.
మొత్తం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టి రూ.6 కోట్లకు పైగా ప్రాఫిట్ సాధించాడు. అయితే రూ.6 కోట్లకు బదులు కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే చేసుకునే వెసులుబాటును సైబర్ నేరగాళ్లు కల్పించారు. ఇదేంటని బాధితుడు వారిని ప్రశ్నిస్తే మరొక 25% ప్రాఫిట్ టాక్స్ కడితే మిగతా డబ్బులు కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు అంటూ నమ్మించారు. అనుమానం వచ్చిన బాధితుడు తాను మోసపోయానని గ్రహించి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి ప్రకటనలను ఆయినా నమ్మవద్దు అని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.