
షాపింగ్, రుచుల విందుకే కాదు.. కళలు, కల్చర్‌కు కూడా నుమాయిష్ నాంపల్లిలోని నూమాయిస్ ఎగ్జిబిషన్ చిరునామాగా నిలుస్తోంది. దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రజల జీవన ప్రవాహంలో భాగమైన ఈ ప్రదర్శన.. ప్రతిభకు వేదికగా, అభిరుచులకు పండుగగా మారింది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నుమాయిష్ 2026 మరోసారి సాధారణ ప్రతిభను ప్రత్యేకంగా ఆవిష్కరిస్తోంది. హోం బేకర్లు, డెజర్ట్ ప్రియులు తమ స్కిల్ ప్రదర్శించేందుకు ఈసారి వంటల పోటీని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 7, శనివారం ఉదయం 11 గంటలకు, నాంపల్లి నుమాయిష్ గ్రౌండ్‌లోని గాంధీ శతాబ్ది భవన్‌లో ఈ పోటీ జరగనుంది. 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీ పూర్తిగా శాకాహార వంటలకే పరిమితం చేశారు.
రెండు విభాగాల్లో వంటల పోటీలు
పోటీని రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. కేక్ డెకరేషన్, ఆరోగ్యానికి మేలు చేసే డెజర్ట్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. రుచితో పాటు క్రియేటివిటీకి కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ విభాగాలను ఎంపిక చేశారు. సలహాదారు ఆసిఫా సాజిద్ , కన్వీనర్ ఎన్. ఉమారాణి ఆధ్వర్యంలో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. కుమారి రుషిక కొతపల్లి, అఖిల సంగం సంయుక్త కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో పాల్గొనాలి అనుకునేవారు నుమాయిష్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆఫీసులో ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు ఫారాలు పొందవచ్చు. ఫిబ్రవరి 3 చివరి తేదీ విజేతలకు ఆకర్షణీయ బహుమతులు అందించనున్నారు.
నుమాయిష్ ప్రత్యేకత
ఇక నుమాయిష్ సాంస్కృతిక కార్యక్రమాలు జనవరి నెలంతా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలుగు, ఉర్దూ కవితా గోష్టులు, ముషైరాలు, గజల్ సాయంత్రాలు.. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు.. భక్తి సంగీతం నుంచి హాస్య, మేజిక్ షోల వరకు విభిన్న కార్యక్రమాలు సందడి చేస్తున్నాయి. జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్–2026, ఫిబ్రవరి 15 వరకు నంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కొనసాగనుంది. షాపింగ్‌తో పాటు సంస్కృతి, ప్రతిభకు వేదికగా నిలుస్తూ.. ఈసారి కూడా నుమాయిష్ నగరవాసులను ఆకట్టుకుంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.