
హైదరాబాద్ ప్రజలకు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే నగరంలో అనేక ఫ్లైఓవర్లు, స్కైవేలు, స్టీల్ బ్రిడ్జిలు ఉన్నాయి. అయితే నగరవాసులకు త్వరలో మరో స్టీల్ బ్రిడ్జి కూడా అందుబాటులోకి రానుంది. మలక్‌పేట్‌లో నల్గగొండ క్రాస్ రోడ్డు నుంచి ఓవైసీ హాస్పిటల్ వరకు స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. దాదాపు 3.32 కిలోమీటర్ల పొడవుతో ఆరు లైన్లుగా ఈ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించారు. మొత్తం రూ.630 కోట్ల ఖర్చుతో దీనిని నిర్మించారు. దాదాపు పనులన్నీ పూర్తి కావడంతో త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. దేవాలయం, ప్రార్థనా మందిరాలపై ప్రభావం పడేలా నిర్మాణం చేస్తున్నారంటూ స్దానికుల నుంచి ఆందోళనలు రేకెత్తాయి. అలాగే భూసేకరణ ప్రక్రియకు కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అధికారులు స్థానిక ప్రజలతో సంప్రదింపులు జరిపి అన్ని సమస్యలను తొలగించారు. అన్ని అడ్డంకులను అధిగమించి చివరికి నిర్మాణం పూర్తి చేశారు. దీంతో త్వరలో ప్రారంభించి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ పరిసర ప్రాంతాల్లో తగ్గుతుందని, ప్రజలకు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని అధికారులు అంటున్నారు.
ఇటీవల జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణణ్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. గడువు ప్రకారం పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు పనులను వేగవంతంగా పూర్తి చేశారు. పనులన్నీ దాదాపు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి రెడీ అయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 2వ తేదీన స్టీల్ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. అనంతరం వాహనదారులకు అందుబాటులోకి రానుంది. ఈ స్టీల్ ఫ్లైఓవర్‌లో ఓవైసీ హాస్పిటల్ వరకు అప్ ర్యాంప్ ఉంటుంది. అక్బర్ బాగ్ వద్ద డౌన్ ర్యాంప్ నిర్మించారు. ఇది పూర్తయితే కంచన్ బాగ్, చంద్రాయణగుట్ట, సైదాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గుతుంది.