Weather alert: ఎండ వేడితో వర్షాకాలంలోనూ వేసవి కాలాన్ని తలపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ అధికారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains in Telangana) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ (మంగళవారం) అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు (బుధవారం) పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. కాగా యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హనుమకొండ, వరంగల్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాలలోనూ వర్షాలు కురిశాయి. యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా నందనంలో అత్యధికంగా 231 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. భువనగిరిలో 13 సెంటీమీటర్లు, తుర్కపల్లి (ఎం)లో 11.8 సెంటీమీటర్లు వర్షం కురిసిందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, వానలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.90 అడుగుల వద్ద ఉంది.
శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) కూ భారీగా ప్రవాహం పెరిగింది. 1.80లక్షల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు వెల్లడించారు. దీంతో సాగర్ కు వస్తున్న నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 కాగా ప్రస్తుతం జలాశయంలో 305 టీఎంసీల నీరు ఉంది. పెరుగుతున్న ప్రవాహంతో ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.
జలాశయాల నుంచి నీటి విడుదలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం