Fish Prasadam: చేప ప్రసాదంపై మళ్లీ మొదలైన వివాదం.. కోర్టు ధిక్కారమంటూ జన విజ్ఞాన వేదిక అభ్యంతరం..

|

Jun 08, 2023 | 12:51 PM

Hyderabad News in Telugu: చేప ప్రసాదం పంపిణీ మరోసారి వివాదానికి కేరాఫ్ అడ్రస్ అయింది. చేప ప్రసాదానికి ఎలాంటి శాస్త్రీయత లేదనే వారు కొందరు. అద్భుతంగా పనిచేస్తుందని మరి కొందరు వాదిస్తున్నారు. ఇంతకీ ఇది మెడిసినా.. లేక ప్రసాదమా..? అన్న చర్చ తెరమీదకు వచ్చింది. ఈ విషయంలో కోర్టు తీర్పు ధిక్కరణకు గురవుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 

Fish Prasadam: చేప ప్రసాదంపై మళ్లీ మొదలైన వివాదం.. కోర్టు ధిక్కారమంటూ జన విజ్ఞాన వేదిక అభ్యంతరం..
Fish Prasadam (File Photo)
Follow us on

హైదరాబాద్: చేప ప్రసాదం.. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో సాగుతున్న తంతు ఇది. ఇప్పటికి కొన్ని కోట్ల మంది ఆస్థమా రోగులు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. ఎంతో నమ్మకంతో ఉత్తర రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ప్రసాదం కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈ ప్రసాదం ఎలా పనిచేస్తుందో ఏమో గానీ.. జనం మాత్రం ఎగబడుతున్నారు. అదే సమయంలో మరోసారి వివాదానికి కేరాఫ్ అయింది. చేప ప్రసాదానికి ఎలాంటి శాస్త్రీయత లేదనే వారు కొందరు. అద్భుతంగా పనిచేస్తుందని మరి కొందరు వాదిస్తున్నారు. ఇంతకీ ఇది మెడిసినా.. లేక ప్రసాదమా..? అన్న చర్చ తెరమీదకు వచ్చింది. ఈ విషయంలో కోర్టు తీర్పు ధిక్కరణకు గురవుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

మృగశిర నెల ప్రారంభం కాగానే.. తెలుగు రాష్ట్రాల్లో ఆస్తమా రోగులకు గుర్తొచ్చేది బత్తిని సోదరులు. ఎందు కంటే మృగశిర కార్తెనాడు వాళ్లు ఇచ్చే చేప ప్రసాదం అంత ఫేమస్. సుమారు 175 ఏళ్లుగా.. వాళ్లు ఈ చేప ప్రసాదాన్ని ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. ఏటా కొన్ని లక్షల మంది ఈ ప్రసాదాన్ని భారీ క్యూలైన్లలో నిలబడిమరీ స్వీకరిస్తున్నారు. వారిలో చాలా మంది ఆస్తమా అదుపులోకి వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇదే చేప ప్రసాదంపై పలు విమర్శలు కూడా ఉన్నాయి. చేప ప్రసాద పంపిణీని జన విజ్ఞాన వేదిక మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎలాంటి  శాస్త్రీయ నిర్ధారణ లేకుండా చేప ప్రసాదాన్ని అక్రమంగా పంపిణీ చేస్తున్నారనేది వారి ఆరోపణ. దీనిపై 2013లో హైకోర్టును ఆశ్రయించింది జన విజ్ఞాన వేదిక. ఈ మందు వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అన్నదానిమీద కూడా ఎలాంటి నిర్ధారణ చేయలేకపోయారు. దీంతో  దీన్ని ‘మందు’ అని పిలవద్దని హైకోర్టు ఆదేశించింది. కానీ ‘ప్రసాదం’ పేరుతో బత్తిన సోదరులు దీన్ని పంపిణీ చేస్తూ వస్తున్నారు.

ఈ ఏడాది కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు బత్తిని సోదరులు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం(ఈ నెల 9) నుంచి రెండ్రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. పంపిణీకి మూడ్రోజుల ముందు నుంచే ప్రసాదం కోసం యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. అయితే చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తే కోర్ట్ దిక్కరణ కింద కేసు పెడతామంటోంది జన విజ్ఞాన వేదిక. ప్రభుత్వం దీనికి ఏర్పాట్లు చేయడం సరికాదంటున్నారు. చేప ప్రసాదం పంపిణీకి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నారు.  బాలల హక్కుల సంఘం వంటి ఆర్గనైజర్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. పసుపు పేస్టుతో ఉన్న కొరమీను చేపను మనుషుల నోట్లోకి వదిలి జబ్బు పోగొడుతుందంటే ఎలా నమ్మేది అంటునారు జన విజ్ఞాన వేదిక సభ్యులు.

ఇవి కూడా చదవండి

బతికున్న చేపను నోట్లో వేసినప్పుడు ఏదైనా ఇబ్బంది ఎదురయితే .. వారి ప్రాణాలకే ముప్పు ఉంటుంది కదా అంటున్నారు వైద్యులు. చేప ప్రసాదం తీసుకుంటే ఆస్తమా రోగం పోతుందన్నదనడానికి ఎలాంటి శాస్త్రీయత లేదని స్పష్టంచేశారు. ఓవైపు చేప ప్రసాదంపై కోర్టుకు వెళ్తామని హేతువాదులు వాదిస్తుంటే.. ఇది నమ్మకం మీద ఆదారపడిందని, చేప ప్రసాదం పంపిణీపై అభ్యంతరాలు సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..