
హైదరాబాద్, జనవరి 17: సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ పర్యాటకశాఖ ‘సెలబ్రేట్ ద స్కై’ పేరిట హాట్ ఎయిర్ బెలూన్ షో మొదలైంది. ఇందులో భాగంగా పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సుమారు గంటన్నర పాటు టూరిజం మినిస్టర్ జూపల్లి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లో 13 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ గొప్ప అనుభూతిని ఇచ్చిందని మంత్రి జూపల్లి అన్నారు.
శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ షో జరుగుతుంది. టికెట్ ద్వారా హాట్ ఎయిర్ బెలూన్ లో నగరవాసులు రైడ్ చేసే అవకాశం ఉంటుందని నిర్వహకులు తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా భవిష్యత్తులో హార్ట్ ఎయిర్ బెలూన్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఈ షోను నిర్వహిస్తుంది. విదేశాల నుంచి రప్పించిన 18 ఎయిర్ బెలూన్లను ఇక్కడ ఎగురవేశారు. ఢిల్లీకి చెందిన స్కై వరల్డ్ బెలూన్ సఫారీ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం దేశస్థులు బెలూన్ల పైలెట్లు, సహాయకులుగా వ్యవహరించారు. పర్యాటకశాఖ బుక్ మై షో ద్వారా ఇదివరకే టికెట్లు విక్రయించింది.
హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించాలనుకునే వారు రైడ్‌లను బుక్ చేసుకోవచ్చు. ఉదయం బెలూన్ రైడ్‌ల ధర ఒక్కొక్కరికి రూ. 2,000 ఉంటుంది. 30-40 నిమిషాలపాటు 4,500 అడుగుల వరకు 8 నుండి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అదే సమయంలో సాయంత్రం టెథర్డ్ రైడ్‌లు, నైట్ గ్లో షోలు నామమాత్రపు రుసుములతో టికెట్లు అందిస్తారు. ప్రేక్షకులకు ఎంట్రీ ఫీజు రూ. 15 మాత్రమే .
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.