
హైదరాబాద్, జులై 17: పదకొండేళ్ల అన్న ఆస్పత్రిలో తీవ్రమైన అప్లాస్టిక్ అనీమియాతో పోరాడుతున్నాడు. ఇది అరుదైన, ప్రాణాంతకమైన రక్త సంబంధిత వ్యాధి. పదేళ్ల బాలిక తన 11 ఏళ్ల అన్న ప్రాణాలను కాపాడటానికి తన ఒంట్లోని స్టెమ్ సెల్స్ (stem cells) ఎంతో ధైర్యంగా దానం చేసి.. బతికించుకుంది. ఒకే తల్లి రక్తం పంచుకుపుట్టిన ఆ అన్నా చెల్లెల్లు ఒకరి ప్రాణం కోసం మరొకరు పోరాడిన విధానం ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. ఆ ప్రేమ పాసమే అన్నను వేగంగా కోలుకునేలా చేసింది.
కొండాపూర్‌లోని కిమ్స్ కడిల్స్ ఆసుపత్రిలో తీవ్ర జ్వరం, రక్త కణాలు ప్రమాదకరమైన స్థాయిలో పడిపోయిన స్థితిలో ఓ బాలుడు చేరాడు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు చేసిన తర్వాత.. బాలుడి ఎముక మజ్జ రక్త కణాలను ఉత్పత్తి చేయడం ఆగిపోయిందని వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితి పది లక్షల మంది పిల్లలలో 7 కంటే తక్కువ మందికి సంభవిస్తుంది. బాలుడి ప్రాణాలు నిలబడాలంటే స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ ఒక్కటే మార్గమని కన్సల్టెంట్ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ చందన మారెడ్డి తెలిపారు. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్‌కు బాలుడి కుటుంబంలో ఓ దాతను కావాలని వైద్య బృందం తెలిపింది. అక్కడే ఉన్న బాలుడి చెల్లెలు వైద్యుల మాటలు విని వెంటనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. తన అన్నను కాపాడుకోవడానికి తాను ఏదైనా చేస్తానని, కావల్సినన్ని స్టెమ్ సెల్స్ తన ఒంట్లో నుంచి తీసుకోవాలని వైద్యులను కోరింది.
నిజానికి, జన్యుపరంగా సగం మాత్రమే సరిపోలిక ఉన్నప్పటికీ వైద్యులు స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతంగా చేశారు. సాధారణంగా ఈ ప్రక్రియ తర్వాత కోలుకోవడానికి రోగికి కొన్ని వారాల పాటు సమయం పడుతుంది. వీరికి ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కోలుకోవడానికి ప్రభావవంతమైన మందులు వాడాల్సి ఉంటుంది. కానీ ఈ బాలుడు మాత్రం కేవలం మూడు వారాల్లోనే కోలుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేనా.. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లాడు. డాక్టర్ చందన ఆ బాలుడి ధైర్యాన్ని ప్రశంసించారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా బాలుడి ఎంతో ధైర్యం కనబరిచాడని, తాను కోలుకున్నాక స్కూల్‌కి వెళ్లి ఆడుకోవడం గురించి మాట్లాడాడని అన్నారు. ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ.. అదృష్టం కొద్దీ బాలుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే కోలుకున్నట్లు తెలిపారు. ధైర్యం, చెల్లి ప్రేమ, వైద్యం.. ఈ మూడు బాలుడికి శ్రీరామ రక్షగా నిలిచినట్లు తెలిపారు. ప్రస్తుతం సదరు బాలుడు పూర్తిగా కోలుకునే స్థితిలో ఉన్నట్లు డాక్టర్ చందన వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.