Hyderabad: ట్యాంక్ బండ్‌పై బర్త్ డే వేడుకలకు ప్లాన్ చేస్తున్నారా… అయితే జాగ్రత్త

| Edited By: Ram Naramaneni

Nov 08, 2023 | 9:07 AM

ట్యాంక్‌బండ్‌ వద్ద అర్ధరాత్రి కేక్‌ కట్‌ చేసి పుట్టినరోజు జరుపుకునే అనాదిగా వస్తున్న సంప్రదాయానికి జీహెచ్‌ఎంసీ స్వస్తి పలికింది. చెత్త వేయడం, పరిశుభ్రత పాటించకపోవడం, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ సమస్యలను కారణాలుగా చూపుతూ.. ఆయా ప్రాంతాల్లో జన్మదిన వేడుకలపై బ్యాన్ విధించింది. సందర్శకులకు పరిశుభ్రత పాటించాల్సిన బాధ్యతను గుర్తు చేసేందుకు జీహెచ్‌ఎంసీ 'డోంట్ లిట్టర్' అని రాసి ఉన్న సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.

Hyderabad: ట్యాంక్ బండ్‌పై బర్త్ డే వేడుకలకు ప్లాన్ చేస్తున్నారా... అయితే జాగ్రత్త
Tank Bund
Follow us on

బర్త్ డే సెలబ్రేషన్స్ అంటే హైదరాబాద్ యువత ట్యాంక్ బండ్‌వైపు పరుగులు తీస్తున్నారు. మిడ్ నైట్ అక్కడ కేక్స్ కట్ చేస్తూ.. ఆ క్షణాలను ఫోన్లలో బంధిస్తున్నారు. అయితే తాజాగా ట్యాంక్ బండ్‌పై పుట్టినరోజు వేడుకలు చేయడానికి వీల్లేదంటూ నిషేధం విధించారు జిహెచ్ఎంసి అధికారులు. వేడుకల సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కేక్ కట్ చేస్తూ.. నాన్నా హంగామా చేస్తుండడంతో GHMC అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సుందరీకరణ పూర్తి కావడంతో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీంతో పుట్టినరోజు వేడుకలను మరచిపోలేని జ్ఞాపకాలుగా మలిచెందుకు ట్యాంక్ బండ్ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలో కేక్ కట్ చేయించి అద్భుతమైన అనుభూతిని పొందుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మాత్రం పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

కేక్ కట్ చేయడంతో పాటు చెత్తాచెదారం అక్కడే పారవేడంతో పరిసర ప్రాంతాలంతా చెత్తగా మారిపోతున్నాయి. ఇదే సందర్భంలో కొందరు పోకిరీలు బర్త్ డే వేడుకల పేరిట ఆగడాలు చేస్తున్నారు. అర్ధరాత్రి కేక్ కట్ చేస్తూ,  ర్యాష్ డ్రైవింగ్ చేయడం, రేసింగులకు పాల్పడుతూ  న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశించేవారికి చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పటికే మితిమీరి ప్రవర్తించిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి భారీగా జరిమానాలు సైతం విధిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అంతేకాదు సాయంత్రం పూట ఫ్యామిలీతో కలిసి ట్యాంక్ బండ్ కు వెళ్లి ఉల్లాసంగా గడిపేవారికి కొందరి ప్రవర్తన ఇబ్బందికరంగా మారడంతో.. బర్త్ డే వేడుకలను నిషేధిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కేక్ కట్ చేస్తే భారీగా జరిమానాలు విధిస్తాం హెచ్చరిస్తున్నారు GHMC అధికారులు. మరోవైపు ఈ నిర్ణయాన్ని మాత్రం కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. బర్త్ డే వేడుకలు సందర్భంగా ఇలాంటి చెత్త వేయకుండా నిబంధనలు తీసుకురావాలి కానీ… ఇలా వేడుకలే జరుపుకోవాలని నిషేధించడం సరికాదని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..