హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం చందానగర్ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18లో నివాసం ఉంటుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుటుంబంలోని నలుగురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అదించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహల్పలోని బ్లాక్ నెంబర్ 18లో ఇంట్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లల ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత శుక్రవారం నుంచి ఇంటి తలుపు వేసివున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈరోజు ఉదయం దుర్వాసన రావడంతో ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగిలులగొట్టి స్థానికులు చూడగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంట్లో భర్త నాగరాజు, భార్య సుజాత, పిల్లలు రమ్యశ్రీ, టిల్లు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ కుటుంబం గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటోంది. అయితే.. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను మార్చురీకి తరలిస్తున్నట్లు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..