సంచలనం రేకెత్తించిన జూబ్లీహిల్స్(Jubilee Hills) ఘటనలో బాధితురాలి వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ చేసిన మరో నలుగురిపై హైదరాబాద్(Hyderabad) పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. వారిని త్వరలోనే ఐపీ అడ్రస్ ఆధారంగా అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ (Social Media) లో ఫోటోలు, వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ కేసులో నిందితుడు A-1 సాదుద్దీన్ ను రెండో రోజు కస్టడీలో తీసుకొని విచారించారు. రేపు జూబ్లీహిల్స్ పీఎస్‌లో పోలీసులు మూడో రోజు విచారించనున్నారు. మైనర్లను కూడా రేపటి నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌లో పోలీసులు విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించి, వారి నుంచి వివరాలు రాబట్టనున్నారు. విచారణ అనంతరం వారిని జువెనైల్ హోమ్‌కు తరలిస్తారు.
కేసులో ఆరుగురు నిందితులు కాకుండా ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిలో ఇద్దరు మేజర్లని చెప్పిన పోలీసులు.. తర్వాత ఒకరే మేజర్ అని, నలుగురు మైనర్లని తేల్చారు. ముందుగా ప్రకటించిన మేజర్ కు 18 ఏళ్లు నిండేందుకు ఇంకా నెల రోజులు ఉండటంతో అతడిని మైనర్ గా తేల్చారు. నిందితుల్లో సాదుద్దీన్ మాలిక్ ఓ టీఆర్‌ఎస్ నేత కుమారుడు కాగా.. ఇద్దరు మైనర్లు కూడా టీఆర్‌ఎస్ నేతల కుమారులని తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి