హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్‌లో ప్రతి ఏటా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్(అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన)కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బుధవారం నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రజల భద్రతపై అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించిన హైకోర్టు.. దీనికి సంబంధించి జనవరి 6లోగా పూర్తి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది.
అయితే గతేడాది నాంపల్లి ఎగ్జిబిషన్‌లో జరిగిన ఘోర అపశ్రుతి నేపథ్యంలో.. ఈ సంవత్సరం నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వకూడదని న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారించిన హైకోర్టు ఎగ్జిబిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని హైకోర్టు సూచించింది.
కాగా నిజాం కాలం నుంచి జరిగే ఈ ఎగ్జిబిషన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రతి ఏటా జనవరి 1 ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్ 45రోజుల పాటు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా వ్యాపార వేత్తలు ఈ ఎగ్జిబిషన్‌లో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఇక ఈ సంవత్సరం వేడుకల కోసం రూ.3కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.