Hyderabad Rains: భారీ వర్షంతో తడిసి ముద్దయిన భాగ్యనగరం.. పలు ప్రాంతాల్లో వడగళ్లవాన..

|

Apr 26, 2023 | 11:33 AM

వాతావరణం భాగ్యనగరవాసులతో ఆడుకుంటోంది. ఓ వైపు సూర్యుడి భగభగలు.. మరోవైపు వరుణుడి ప్రతాపం. ఉదయం భానుడు సెగలు కక్కుతుంటే.. సాయంత్రం వరుణుడి వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకా హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం అయోమయానికి గురవుతోంది. పొద్దెరగని వానలతో..

వాతావరణం భాగ్యనగరవాసులతో ఆడుకుంటోంది. ఓ వైపు సూర్యుడి భగభగలు.. మరోవైపు వరుణుడి ప్రతాపం. ఉదయం భానుడు సెగలు కక్కుతుంటే.. సాయంత్రం వరుణుడి వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకా హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం అయోమయానికి గురవుతోంది. పొద్దెరగని వానలతో సిటీ వాసులు ఇబ్బంది పడుతున్నారు.
ఉదయం బానుడి భగభగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరాబాద్‌ నగర వాసులపై సాయంత్రం వేళ ఈదురు గాలుతో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ఒకే రోజులో భాగ్యనగర వాసులు విభిన్న వాతావరణం చూస్తున్నారు. రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో బయటకు వెళ్లిన నగరవాసులు, వాహనదారులు తడిసి ముద్దయ్యారు. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నగరంలోని గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలో మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు భయందోళనకు గురైయ్యారు. నగరంలో కూకట్‌పల్లి, మూసాపేట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి, చందానగర్‌, మియాపూర్‌, బాలానగర్‌, సూరారం, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌తో పాటుగా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్​లో వర్షం నీరు రోడ్డుపై ప్రవహించడంతో ట్రాఫిక్‌కు నిలిచిపోయింది. నాలాల్లో నీరు నదులను తలపిస్తోంది. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొట్టింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్ లో తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల భారీ హోర్డింగ్‌లు నేలకొరిగాయి. వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి, మోమిన్‌పేట్‌ మండలాల్లో తీవ్రంగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురవడంతో చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 10గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను టీఎస్‌డీపీఎస్‌ ప్రకటించింది. సిద్దిపేట జిల్లా దూల్‌మిట్టలో అత్యధికంగా 83.5 మీ, సంగారెడ్డి జిల్లా ఆర్‌.సిపురంలో 79.8, రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో 77.5, యాదాద్రి జిల్లా నందనంలో 77.8, భువనగిరిలో 73.8, మేడ్చల్‌ జిల్లా కీసరలో 75, మల్కారంలో 71.3, సిద్దిపేట జిల్లా గండిపల్లిలో 69.3 మీ వర్షపాతం నమోదైంది. విపరీతమైన ఈదురుగాలులు వీస్తుండటంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. మరోసారి వర్షం కురవచ్చునని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని హెచ్చరించారు.

కాగా, హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో బీభత్స సృష్టించేలా దంచికొట్టిన వర్షం నగరవాసులకు ఉక్కపోత నుండి కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఇదే అకాల వర్షం తెలంగాణని కుదిపేస్తోంది కూడా. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వడగళ్లవాన కురవడంతో రైతన్నలకు అపార నష్టం వాటిల్లింది. ఇప్పటికే వర్షం కారణంగా రాలిన మామిడిని వ్యాపారులు కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు కొనుగోలు చేయని వ్యాపారులు. అలాగే వరి, మిర్చి రైతులు కూడా పంట నష్టంతో లబోదిబోమంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..