
హైదరాబాద్ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్‌న్యూస్ తెలిపింది. నగరంలో మరో రెండు కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి సిద్దమవుతోంది. భాగ్యనగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఎక్కడిక్కడ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడుతోంది. ఇప్పటికే నగరంలో అనేక చోట్ల ఫ్లైఓవర్లు ఉండగా.. ప్రస్తుతం మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని ప్రతిపాదనల దశలో ఉండగా.. ఇంకెన్ని త్వరలో నిర్మాణం ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనదారులకు అవస్థలు తగ్గించేందుకు రెండు కొత్త ఫ్లైఓవర్లను నిర్మించేందుకు సిద్దమయ్యారు. రూ.345 కోట్లతో వీటిని నిర్మించనుండగా.. వీటి వల్ల ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది.
పాతబస్తీలో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్దమైంది. 100 అడుగులతో రెండు ఆరులైన్ల ఫ్లైఓవర్లను నిర్మించనుంది. ఇందులో ఒకటి పాతబస్తీలోని హఫీఝ్ బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ చర్చి వరకు నిర్మించనుండగా.. మరో ఫ్లైఓవర్ బండ్లగూడ నుంచి ఎర్రకుంట వరకు నిర్మించేందుకు సిద్దమవుతున్నారు. ఈ రెండు ఫ్లైఓవర్ల కోసం రూ.345 కోట్లు ఖర్చు అవుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల కోసం రూ.7 వేలకుపైగా కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించనుంది. వీటి నుంచి ఈ రెండు ఫ్లైఓవర్లకు నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 3న టెండర్లను ఆహ్వానించనుండగా.. బిడ్డింగ్ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు. అనంతరం మార్చి 1వ తేదీ నుంచి ఈ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు మొదలుపెట్టాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.
ఈ రెండు ఫ్లైఓవర్లతో పాతబస్తీలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గనుంది. పాతబస్తీలో ఇరుకు రోడ్లు ఉండటం వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్లతో ఎయిర్ పోర్ట్-బాలాపూర్ మార్గంలో ట్రాఫిక్ జామ్ తగ్గనుంది. ఇక ఈ ఫ్లైఓవర్లతో పాటు ఓవైసీ ఫ్లైఓవర్‌కు అనుబంధంగా కిందకు దిగే ర్యాంపును నిర్మించనున్నారు. ఫిబ్రవరి 3న టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. ఫిబ్రవరి 12న ప్రీ బిడ్డింగ్ సమావేశం ఉంటుంది. ఇక 20 వరకు టెండర్లను ఆహ్వానిస్తారు. అనంతరం టెండర్ల ప్రక్రియను పూర్తి చేశాక కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మార్చి నుంచి వీటి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అటు ఇప్పటికే కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్దమవుతోంది. ఈ మేరకు త్వరలో పనులను మొదలుపెట్టనుంది.