Hyderabad: హైదరాబాద్ రోడ్లపై ఇక హలీం బట్టీలు కనిపించవా..! అసలు మ్యాటర్ తెలిస్తే

హైదరాబాదీ రోడ్లపై ఇక హలీం బట్టీలు కనిపించవా.? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇది. హలీం నిర్వాహకులు పండుగకు బట్టీలు ఏర్పాటు చేసుకుంటుంటే.. ట్రాఫిక్ పోలీసుల తీరు.. వారిపై మరో రకంగా ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి..తీయించేస్తున్నారు. ఆ వివరాలు..

Hyderabad: హైదరాబాద్ రోడ్లపై ఇక హలీం బట్టీలు కనిపించవా..! అసలు మ్యాటర్ తెలిస్తే
Haleem

Edited By: Ravi Kiran

Updated on: Feb 11, 2025 | 8:19 PM

హైదరాబాద్‌లో హలీం నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. తాము ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న హలీం బట్టీలను కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై హలీం నిర్వాహకులు మండిపడుతున్నారు. అన్ని అనుమతులు తీసుకునే హలీం స్టాళ్లు నిర్వహిస్తున్నామని, ఇలా చేసి మా పొట్ట కొట్టవద్దంటూ ప్రాధేయపడుతున్నారు. నగరంలో రంజాన్ మాసం వస్తుందంటే ఎక్కడ చూసినా హలీం సందడే కనబడుతుంది. రంజాన్ వస్తుందంటే చాలు.. ఎప్పుడెప్పుడు ఆస్వాదిద్దామా అని హలీం ప్రియులు ఎదురుచూస్తుంటారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంత ప్రత్యేకమైందో.. హలీం మీద ఉన్న ఇష్టం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. జనాలు అంతగా ఇష్టపడే హలీంకి సంబంధించిన వ్యాపారాన్ని తమకు కాకుండా చేసి ఇలా ఇబ్బందులు పెడుతున్నారని హలీం నిర్వాహకులు చెబుతున్న మాట.

నగరంలోని బంజారాహిల్స్‌ సలీంనగర్‌లో కొందరు హలీం నిర్వాహకులు రోడ్డెక్కారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హలీం బట్టీలను కూల్చివేశారని మండిపడుతున్నారు. గత 30 ఏళ్లుగా ఇక్కడే హలీం విక్రయాలు సాగిస్తున్నామని, ఇదే తమ జీవనాధారమని ఇప్పుడు కొత్తగా ఇలా తమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయడం సరికాదని అంటున్నారు. మా తాతముత్తాతల దగ్గరి నుంచి ఏటా హలీం వ్యాపారం నిర్వహిస్తున్నామని, గతంలో ఎప్పుడూ ఇలా ఇబ్బందులు ఎదురవలేదని చెబుతున్నారు. మాలాంటి పేదలపైన ఇలా అధికారులు జులుం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని, దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని అంటున్నారు. రంజాన్ మాసం దృష్ట్యా ఒక నెల వ్యాపారం నిమిత్తం బట్టీ ఏర్పాటు చేసుకున్నామని, నెల గడిచిన తర్వాత తమంతట తామే వాటిని తొలగిస్తామని.. కానీ, ఇంతలో ఇలా చేసి తమను ఇబ్బందులు పెడుతున్నారని నిర్వాహకులు ఆందోళనతో చెబుతున్నారు.

అయితే నిర్వాహకుల దయనీయ పరిస్థితి ఇలా ఉంటే, రోడ్డు పక్కన ఏర్పాటు చేసే హలీం బట్టీల ద్వారా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని.. అందుకే తొలగించాల్సిన అవసరం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు నిర్వహించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరిస్తున్నారు. నియమ నిబంధలను అతిక్రమించి రోడ్డుకు ఇరువైపులా హలీం బట్టీలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి