మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి దారుణ హత్యపై సస్పెన్స్ కొనసాగుతోంది. యువతిని ఎవరు హత్య చేశారు.? ఎక్కడైనా హత్య చేసి.. ఇక్కడికి తీసుకొచ్చి కాల్చేశారా.? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం బకారం గ్రామం పరిధిలోని గ్రీన్ ర్యాలీ రిసార్ట్ దగ్గర ఓ యువతిని కాల్చి చంపేశారు గుర్తుతెలియని వ్యక్తులు. అక్కడే పొలాలలో పనిచేస్తున్న కొంతమంది రైతులు కాలుతున్న బాడీని చూసి పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఖాకీలు ఆధారాలను సేకరించి.. విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బకారం గ్రామం పరిధిలో ఓ యువతి మృతి చెందింది. యువతి మృతదేహం కాలుతూ ఉండడంతో పక్కనే పొలాలకు వెళ్లే రైతులు.. దాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడున్న ఆధారాలను సేకరించారు. మృతదేహం 20-25 మధ్య వయస్సు ఉన్న యువతిదిగా గుర్తించారు. ఆ మృతదేహం పక్కనే మొబైల్ ఫోన్ కూడా పూర్తిగా కాలి బూడిదై కనిపించింది. దీంతో ఈ కేసు సాల్వ్ చేయడం పోలీసులకు కాస్త కష్టతరంగా మారింది.
యువతిని వేరే ప్రదేశంలో హత్య చేసి ఈ ప్రాంతానికి తీసుకువచ్చి కాల్చినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరైనా..? ఎక్కడైనా..? మిస్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. ఇప్పటివరకు ఎక్కడా కూడా మిస్సింగ్ కంప్లైంట్ నమోదు కాకపోవడంతో.. యువతి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ యువతిని అదే ప్రదేశంలోకి ఎందుకు తీసుకుని వెళ్లారు.? అది నిందితులకు తెలిసిన ప్రదేశమా.? అసలు ఆమెను ఎక్కడ హత్య చేశారు.? ఎవరా వ్యక్తులు.? అనే దానిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా, ఈ కేసులో నిందితులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు పోలీసులు.