
తెలంగాణ హైకోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. మద్యం సేవించి వాహనం నడిపినట్టు నిర్ధారణ అయితే కేసు నమోదు చేయవచ్చని, అయితే కేవలం ఆ కారణంతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రాసిక్యూషన్‌కు వెళ్లాలి. వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం మాత్రం చట్టబద్ధం కాదని తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఆలస్యం లేకుండా మూడు రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు వేగంగా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలీసులు కచ్చితంగా రవాణాశాఖ నిబంధనల్లోని 44ఏను ఫాలో అవ్వాలని ఆదేశించింది.
మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వాహనం నడపకూడదని పేర్కొన్న కోర్టు, అదే వాహనంలో ఉన్న మద్యం తాగని, లైసెన్స్ ఉన్న వ్యక్తికి వాహనం అప్పగించాలి. అటువంటి వ్యక్తి లేకపోతే బంధువులు లేదా స్నేహితులను పిలిపించి ఇవ్వాలి. ఎవరూ అందుబాటులో లేని పరిస్థితిలో మాత్రమే వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించాలి. ఒకవేళ వాహనం పోలీసుల వద్ద ఉంటే, యజమాని సంబంధిత పత్రాలు చూపిన వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. పోలీసులు తెలంగాణ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తి వాహనాన్ని సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పౌరులు బాధ్యతతో మెలగాలని.. మద్యపానం చేసి వాహనాలు నడపడం తీవ్ర అనర్థాలకు దారి తీస్తుందని కోర్టు పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..