
హైదరాబాద్, అక్టోబర్ 26: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఓ మహిళా ప్రయాణికురాలి వాలకం అధికారులకు వింతగా తోచింది. వెంటనే ఆమె చేతిలోని సూట్కేసును లాక్కుని, నఖశిఖ పర్యాంతం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ తర్వాత సూట్ కేస్ తెరచి కూడగా.. సూట్ సెటప్ కాస్త విడ్డూరంగా తోచింది. అంతే అధికారులు వెంటనే తమ బుర్రకు పనిచెప్పారు. వెంటనే సుత్తి, కత్తి పట్టుకొచ్చి సూట్ కేసును ముక్కలు ముక్కలుగా కోసి పడేశారు. ఆ తర్వాత లోపల ఉన్నది చూసి ఖంగుతిన్నారు. సూట్ కేస్ అడుగున పచ్చ రంగులో మూడు ప్యాకెట్లు కనిపించాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపగా అసలు యవ్వారం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అసలింతకీ ఏం దొరికిందంటే..
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిపై డిఆర్ఐ అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే సదరు మహిళను అదుపులోకి తీసుకుని ఆమె లగేజీ బ్యాగేజ్ చెకింగ్ చేయడంతో బ్యాగ్ అడుగు భాగంలో గ్రీన్ కలర్ పదార్థం కనిపించింది. అవన్నీ కవర్లలో మస్తు బందోబస్తుతో జాగ్రత్తగా ఉంచారు. దీంతో అధికారులు ఆ గ్రీన్ కలర్ పదార్థాన్ని టెస్టింగ్కు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అందించారు. వీరి తనిఖీల్లో అది హైడ్రోపోనిక్ గాంజాగా తేలింది. దీంతో హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ హైడ్రోపోనిక్ విలువ దాదాపు 4.15 కోట్లు ఉంటుందని డిఆర్ఐ అధికారులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.