Agnipath uproar: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన యువకుడి వివరాలివే.. అతని అక్క BSFలో…

పోలీసుల కాల్పుల్లో చనిపోయిన మృతుడికి పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు డాక్టర్లు. మరోవైపు ఆందోళనకారుల నిరసనల్లో నాలుగు కోచ్​లు పాక్షికంగా దగ్ధమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Agnipath uproar: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన యువకుడి వివరాలివే.. అతని అక్క BSFలో...
Rakesh (file Photo)

Updated on: Jun 17, 2022 | 3:34 PM

Protest against Agnipath: సికింద్రాబాద్‌ అల్లర్లలో దామోదరం రాకేష్‌ అనే యువకుడు చనిపోయాడు. పోలీసుల కాల్పుల్లో బుల్లెట్‌ తగలడంతో అతడు చనిపోయినట్లు తెలుస్తోంది. రాకేష్‌ చనిపోయాడన్న వార్తతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. వరంగల్‌ జిల్లా దబ్బీర్‌ పేట గ్రామానికి చెందిన రాకేష్‌.. ఆర్మీ జవాన్‌ కావాలని కలలు కన్నాడు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో నిబంధనలు మార్చడంతో.. ఈరోజు సికింద్రాబాద్‌ స్టేషన్లో ఆందోళనల్లో పాల్గొన్నాడు. అక్కడ పోలీసుల కాల్పుల్లో చనిపోవడంతో అతడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు గాంధీ ఆస్పత్రి డాక్టర్లు. ఇక రాకేశ్ సోదరి సంగీత కూడా అర్మీ జవాన్‌గానే పనిచేస్తున్నారు. BSF జవాన్‌గా ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగాల్ లో డ్యూటీ చేస్తున్నారు. అక్క ప్రోత్సాహంతోనే ఆర్మీలో చేరాలని కఠోర సాధన చేశాడు రాకేశ్. హైదరాబాద్ కు మూడు రోజుల క్రితం వచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.

మరో యువకుడికి ఛాతిలో బుల్లెట్…

సికింద్రాబాద్ ఘటనలో మరో యువకుడికి బెల్లెట్‌ గాయమైంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో వినయ్‌ అనే యువకుడి చాతిలో నుంచి వెళ్లింది బుల్లెట్‌. దీంతో గాయపడిన వినయ్‌ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. వినయ్‌ది మహబూబాబాద్ జిల్లాగా గుర్తించారు. ఓవైపు చాతిలో బుల్లెట్‌ దిగినా.. వినయ్‌ మాత్రం పోరాడేందుకే సిద్ధపడ్డాడు. అతడిని సహచరులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. వినయ్‌ గార్ల మండలం మద్దివంచ గ్రామంగా తెలుస్తోంది. ప్రస్తుతం వినయ్‌కి గాంధీలో చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

రైల్వే స్టేషన్‌లో ఉదయం ఏం జరిగింది… 

ఉదయం 9గంటల దాకా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ప్రశాంతంగా ఉంది. ప్రయాణికులతో సందడిగా బిజీబిజీగా కనిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా అలజడి చెలరేగింది. పెద్ద సంఖ్యలో యువకులు స్టేషన్‌లోకి ఎంటరయ్యారు. కొంతమంది ముందుగానే రాళ్లు చేతబట్టుకున్నారు. ఇంకొందరు కర్రలు పట్టుకున్నారు. స్టేషన్‌లోకి ఎంటరవుతూనే దాడికి తెగబడ్డారు. ఒక్కొక్కరుగా వందలమంది గుమిగూడారు. ఒకర్ని చూసి మరొకరు రెచ్చిపోయారు. పార్సిల్ కౌంటర్లపై దాడి చేశారు. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేశారు. రైలు పట్టాలపై సామాగ్రిని పడేసి నిప్పు పెట్టారు.