AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

52 రోజుల స్పెషల్ డ్రైవ్.. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్, 154 మంది అరెస్ట్

Hyderabad drugs case: హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ మాఫియాపై సైబరాబాద్ పోలీసులు భారీ డ్రైవ్ నిర్వహించి రూ.3.69 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 61 కేసులు నమోదు చేసి 154 మందిని అరెస్ట్ చేశారు. గంజాయి, మెతాంఫెటమైన్, హషీష్ ఆయిల్‌తో పాటు గంజాయి చాక్లెట్లు కూడా పట్టుబడ్డాయి.

52 రోజుల స్పెషల్ డ్రైవ్.. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్, 154 మంది అరెస్ట్
Drugs In Hyderabad
Ranjith Muppidi
| Edited By: |

Updated on: May 24, 2026 | 3:07 PM

Share

హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ మాఫియాపై సైబరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపారు. గత 52 రోజులుగా కొనసాగిన ప్రత్యేక డ్రైవ్‌లో రూ.3.69 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని 154 మందిని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి మే 22 వరకు ఎన్డీపీఎస్ చట్టం కింద మొత్తం 61 కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ రవాణా, సరఫరాపై నిఘా పెంచి వరుస దాడులు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో అత్యధికంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 42 కేసుల్లో 559 కిలోలకుపైగా గంజాయిని పట్టుకుని 108 మందిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.79 కోట్లుగా అధికారులు తెలిపారు.

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్కా ప్రణాళికతో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఇక గంజాయి కలిపిన చాక్లెట్లు కూడా మార్కెట్‌లోకి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు కేసుల్లో గంజాయి మిశ్రమంతో తయారు చేసిన చాక్లెట్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు.

అలాగే సింథటిక్ డ్రగ్స్‌పై కూడా పోలీసులు దృష్టి సారించారు. రెండు కేసుల్లో 317 గ్రాముల మెతాంఫెటమైన్‌ను పట్టుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదు కేసుల్లో హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ విక్రేతలతో పాటు వినియోగదారులపై కూడా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపై 10 కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినా, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Follow Us