Lockdown: నేటి నుంచి తెలంగాణలో కఠిన లాక్‌డౌన్.. అనుమతి ఉన్నవి.. అనుమతి లేనివి.. ఇవే.!

|

May 12, 2021 | 4:39 PM

Telangana Lockdown: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగా.

Lockdown: నేటి నుంచి తెలంగాణలో కఠిన లాక్‌డౌన్.. అనుమతి ఉన్నవి.. అనుమతి లేనివి.. ఇవే.!
Follow us on

Telangana Lockdown: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగా నమోదు కావడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మే 12వ తేదీ (నేడు) నుంచి కఠిన లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ లాక్‌డౌన్‌ ఇవాళ ఉదయం 10 గంటల నుంచి అమల్లోకి రానుంది. మే 12 ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు ఈ లాక్ డౌన్ అమలు కానుండగా.. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించింది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పకడ్బంధీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతించింది.

లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..

  • వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలకు ఎక్కడా ఆటంకం కలిగించకూడదు
  • వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు
  • ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగనున్నాయి
  • ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు,
  • అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.
  • విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.
  • జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.
  • పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.
  • కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు.
  • ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మినహాయింపు ఇచ్చారు.
  • ఉపాధి హామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.
  • ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
  • బ్యాంకులు, ఏటీఎంలు యథావిథిగా పని చేయనున్నాయి
  • ముందస్తు అనుమతులతో జరిగే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.
  • అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ఉంది.

కాగా, తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది. ప్రజలు ఎక్కువగా గుమిగూడే సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి ఉంటాయి. పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

ఇక లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో రాష్ట్రంలో వైన్‌షాపులు, బార్లను తెరిచి ఉంచాలని ఎైక్సెజ్‌శాఖ నిర్ణయించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మద్యంషాపులు తెరిచి ఉంచవచ్చని ఆ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులిచ్చారు. షాపుల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించన మద్యం షాపులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్ద నిలిపివేస్తారు. నిత్యావసర సరుకుల రవాణా వాహనాలను అనుమతిస్తారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను పూర్తిగా రద్దుచేశారు. ప్రజలు లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు సరిహద్దు దాటే అవకాశం లేదు. ఆర్టీసీ బస్సులు, సెట్విన్‌, హైదరాబాద్‌ మెట్రో, ట్యాక్సీలు, ఆటోలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకే తిరుగుతాయి. వైద్యసిబ్బంది, వైద్యం కోసం అత్యవసరంగా వెళ్లే ప్రయాణికులకు అనుమతి ఇస్తారు. లాక్ డౌన్ సమయంలో అన్నిరకాల ప్రార్థనా మందిరాలను మూసి ఉంటాయి. మతపర కార్యక్రమాలకు అనుమతి లేదు. పదిరోజులపాటు అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేస్తారు. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీకేంద్రాల నుంచి బియ్యం, నూనె, పప్పులు ఇంటికి తీసుకెళ్లవచ్చు.

అత్యవసర జాబితాలోకి వచ్చే శాఖల్లో పూర్తి స్థాయి సిబ్బంది హాజరు కావాలని ప్రభుత్వం పేర్కొంది. వైద్య ఆరోగ్యం, పోలీస్‌, అగ్నిమాపకశాఖ, పంచాయతీరాజ్‌, పురపాలక, విద్యుత్తు, నీటిసరఫరా, ఆదాయం పన్ను, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌, రవాణా, అన్ని రకాల కార్పొరేషన్లు, వ్యవసాయం, హార్టికల్చర్‌, అనుబంధ రంగాలు, పౌరసరఫరాల శాఖలు పూర్తి స్థాయి సిబ్బందితో పని చేయనున్నాయి. అంతే కాకుండా కొవిడ్‌ విధులు అప్పగించిన ఇతర శాఖలు. వీటితోపాటు ప్రభుత్వం అప్పటికప్పుడు నోటిఫై చేసే శాఖల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరుకావాల్సి ఉంటుంది. మిగతా అన్ని విభాగాల్లో 33 శాతం సిబ్బందితో విధులు నిర్వహించాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

Also Read: కరోనా కాలంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి నో బయోమెట్రిక్‌.. ఆదేశాలు జారీ..