AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్లక్ష్యం వద్దు.. వారి పట్ల కఠినంగానే ఉండాలి.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు అండగా నిలవడానికే తప్ప నేరస్తులకు కాదని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని సహించబోమని హెచ్చరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచినట్లు ప్రకటించారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లలకు విద్యా పరంగా సహాయం అందిస్తామని తెలిపారు.

నిర్లక్ష్యం వద్దు.. వారి పట్ల కఠినంగానే ఉండాలి.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Cm Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Oct 21, 2026 | 10:37 AM

Share

హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులకు అండగా నిలవడానికే గానీ, నేరస్థులకు కాదని.. చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 21 ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, వీరమరణం పొందిన పోలీసు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించే ప్రసక్తే లేదని సీఎం హెచ్చరించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని పోలీసు వ్యవస్థ కల్పించాలన్నారు. బాధితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని.. ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా విధులు నిర్వర్తించాలని.. చట్ట పరిధిలోనే ప్రతి పోలీసు అధికారి పనిచేయాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరికీ లేదని, అధికారులు జవాబుదారీతనం, పారదర్శకతతో ప్రజలకు చేరువ కావాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తూనే ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.

అమరుల త్యాగాలు చిరస్మరణీయం – భారీగా పెరిగిన పరిహారం:

1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైనికులతో పోరాడి వీరమరణం పొందిన 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాన్ని స్మరిస్తూ ఈ రోజును పాటించుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ ఏటా దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 154 మంది సీఆర్‌పీఎఫ్, పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ప్రకటించారు.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.40 లక్షల నుంచి రూ.కోటికి పెంచామన్నారు. ఎస్సై, ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారులకు రూ.40 లక్షల నుంచి రూ.1.25 కోట్లకు, ఎస్పీ స్థాయి అధికారులకు ఏకంగా రూ.2 కోట్లకు పరిహారం పెంచినట్లు తెలిపారు. అమరుల కుటుంబాల్లో అర్హులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలంతో పాటు వారి పిల్లలకు మెడికల్ కాలేజీల్లో ప్రత్యేక సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు అమరులు చేసిన త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, అమరుల కుటుంబ సంక్షేమానికి తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

భారీగా ఉద్యోగాలు:

రాష్ట్రంలో శాంతిభద్రతలు బలంగా ఉంటేనే పెట్టుబడులు వచ్చి అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే తమ ప్రభుత్వం రాగానే పోలీసు శాఖకు ప్రాధాన్యతనిచ్చి 7,437 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిందని సీఎం తెలిపారు. 2028 నాటికి శాఖలోని అన్ని ఖాళీలనూ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ విభాగాల్లో ట్రాన్స్‌జెండర్ల నియామకం ద్వారా సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని, అలాగే హోంగార్డుల నుండి డీజీపీ స్థాయి అధికారుల పిల్లల వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో చదువుకునేలా ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ ప్రారంభించామని వివరించారు.

వీడియో చూడండి..

Follow Us