Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ మహా గణపతికి సీఎం రేవంత్‌రెడ్డి తొలి పూజ.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..

|

Sep 07, 2024 | 6:35 PM

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి షురూ అయ్యింది. వాడవాడలా దర్శనమిస్తున్నాడు గణనాథుడు. గణేష్‌ నవరాత్రులంటే అందరికి మొదటిగా గుర్తొచ్చే ఖైరతాబాద్‌ గణనాథుడు ఈసారి శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ మహా గణపతికి సీఎం రేవంత్‌రెడ్డి తొలి పూజ.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..
Khairatabad Ganesh
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి షురూ అయ్యింది. వాడవాడలా దర్శనమిస్తున్నాడు గణనాథుడు. గణేష్‌ నవరాత్రులంటే అందరికి మొదటిగా గుర్తొచ్చే ఖైరతాబాద్‌ గణనాథుడు ఈసారి శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో కొలువైన సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇక్కడ గణేశ్‌ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వినాయకుడిని దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు. గణేశ్‌ ఉత్సవ సమితి నిర్వాహకులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షి మహాగణపతిని దర్శించుకున్నారు.

70 ఏళ్లుగా భక్తి శ్రద్ధలతో ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి వేడుకలను ఉత్సవ కమిటీ నిర్వహించడం అభినందనీయమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అందరి పూజలు, దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డామని పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకున్నారు. నిర్వాహకులు, పూజారులు గవర్నర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లంబోదరుడికి హారతిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, అందరిపై వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించినట్లు గవర్నర్ చెప్పారు. పలువురు ప్రముఖులు సైతం ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుని పూజలు చేశారు.

మరోవైపు మహాగణపతి వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

17న నిమజ్జనం..

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తి కావడంతో… ఈసారి 70 అడుగుల ఎత్తైన మహా మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. సుమారు 200 మంది కార్మికులు నెలన్నర రోజుల్లో ఈ విగ్రహాన్ని అన్ని హంగులతో పూర్తి చేశారు. ఈసారి గణనాథుడు సప్త ముఖి కావడం విశేషం. అంటే వినాయకుడికి 7 ముఖాలు ఉంటాయి. అలాగే ఇవాళ పండగ రోజు కూడా ఏడో తారీఖే. అలాగే ఈ నెల 17న నిమజ్జనం ఉంటుంది. ఇలా ఏడో నెంబర్‌ ఈసారి చాలాసార్లు రావడం మంచి విశేషంగా చెబుతున్నారు నిర్వాహకులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..