Revanth Reddy: రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీని ఆహ్వానిస్తాం.. తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..

|

Feb 15, 2024 | 7:59 PM

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. సెక్రటేరియట్, అమరవీరుల స్మారకం మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు బుధవారం రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

Revanth Reddy: రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీని ఆహ్వానిస్తాం.. తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..
Foundation stone for former PM Rajiv Gandhi’s statue in Hyderabad
Follow us on

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. సెక్రటేరియట్, అమరవీరుల స్మారకం మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు బుధవారం రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు, అవశ్యకత గురించి నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టెలికాం రంగంలో రాజీవ్ గాంధీ విప్లవాత్మక మార్పు తెచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చరిత్రలో నిలిచిపోయే సందర్భమని పేర్కొన్నారు. ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపించిందని అందుకే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అంటూ కొనియాడారు.

రాజీవ్ గాంధీ విగ్రహం కేవలం జయంతి, వర్ధంతులకు దండలు వేసి దండాలు పెట్టడానికే కాదని.. మహానుభావుల విగ్రహాలు చూసినపుడు వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలన్న భావన మనకు కలగాలంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని.. సెక్రటెరియేట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్నన్ని రోజులు ఈ సందర్భం గుర్తుంటుందని తెలిపారు. అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నామని.. విగ్రహావిష్కరణకు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

బీఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు..

కాగా.. సచివాలయం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ స్పందించింది. రాజీవ్‌కు తెలంగాణకు సంబంధం ఏంటని.. ఇక్కడ ఆయన విగ్రహం ఎందుకంటూ ప్రశ్నలు సంధించింది. సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచించారు. సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని.. ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉందని.. కానీ తెలంగాణ తల్లి అత్యంత ముఖ్యం అని వివరించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఙప్తి చేశారు.

అధికార, విపక్షాల మధ్య.. కొత్తగా విగ్రహ వివాదం తారాస్థాయికి చేరగా.. కాంగ్రెస్ మాత్రం ఈ ప్రాంతంలో కచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టంచేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..