Hyderabad: వాహనదరులకు అద్దిరిపోయే న్యూస్.. ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ

జాతీయ రహదారులపై ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైవేల నిర్మాణంతో పాటు, నిర్వహణ, భద్రత, ప్రయాణ సౌకర్యాల్లోనూ సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తోంది. వాహనదారులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అరచేతిలో అందించడంతో పాటు, టోల్ గేట్ల వద్ద ఆగకుండా ప్రయాణించేలా ఆధునిక డిజిటల్ వ్యవస్థలను అమలు చేస్తోంది.

Hyderabad: వాహనదరులకు అద్దిరిపోయే న్యూస్.. ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ
Hyderabad

Edited By:

Updated on: Dec 17, 2025 | 1:03 PM

భారత్‌లో ప్రస్తుతం 63 లక్షల కిలోమీటర్లకు పైగా రహదారులు ఉండగా, ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌గా నిలుస్తోంది. 2013–14లో 91,287 కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారులు, ఇప్పుడు 1,46,204 కిలోమీటర్లకు చేరాయి. పదకొండేళ్లలో దాదాపు 55 వేల కిలోమీటర్ల కొత్త హైవేలు నిర్మించడంతో వాహనాలు, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి టెక్నాలజీని కీలకంగా మారుస్తోంది ప్రభుత్వం.

‘రాజ్మార్గ్ యాత్ర’ యాప్‌లో సకల సమాచారం

హైవేలపై ప్రయాణించే వారికి కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ‘రాజ్మార్గ్ యాత్ర’ యాప్ కీలకంగా మారింది. ఈ యాప్ ద్వారా హైవేల వివరాలు, టోల్ ప్లాజాలు, సమీపంలోని పెట్రోల్ పంపులు, ఆస్పత్రులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, వాతావరణ సమాచారం అందుతుంది. ఫాస్టాగ్ సేవలు, స్పీడ్ లిమిట్ అలర్ట్స్ కూడా ఇందులో లభిస్తున్నాయి. రోడ్లపై గుంతలు, నిర్వహణ లోపాలు, ఆక్రమణలు, భద్రతా సమస్యలపై జియో-ట్యాగ్ ఫొటోలు, వీడియోలతో ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు పురోగతిని ట్రాక్ చేసే సౌకర్యం ఉంది. ఇప్పటికే ఈ యాప్‌ను 15 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకోగా, ప్లే స్టోర్‌లో మంచి రేటింగ్‌ను సాధించింది.

రహదారి నిర్వహణకు ‘ఎన్హెచ్ఎఐ వన్’ యాప్

జాతీయ రహదారుల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ‘ఎన్హెచ్ఎఐ వన్’ యాప్‌ను ప్రారంభించింది. హైవేల నిర్వహణ, రోడ్ సేఫ్టీ ఆడిట్స్, క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు, రోజువారీ నిర్మాణ తనిఖీలు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలు ఈ యాప్‌లో నమోదు అవుతాయి. ప్రాంతీయ అధికారులు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, టోల్ ప్లాజా సిబ్బంది వరకు ప్రతిరోజూ తమ కార్యకలాపాలను ఇందులో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. జియో-ట్యాగింగ్, టైమ్ స్టాంపింగ్ ఫీచర్లతో జవాబుదారీతనం పెరుగుతోంది.

క్యూఆర్ కోడ్‌తో ప్రాజెక్ట్ సమాచారం

హైవేలపై ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ సైన్ బోర్డుల ద్వారా ప్రయాణికులకు మరిన్ని వివరాలు అందుతున్నాయి. ఈ బోర్డులపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, ప్రాజెక్టు వివరాలు, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్లు, సమీప ఆస్పత్రులు, పెట్రోల్ పంపులు, ఈవీ చార్జింగ్ స్టేషన్ల సమాచారం లభిస్తుంది.

నెట్వర్క్ సర్వే వెహికల్స్‌తో పర్యవేక్షణ

జాతీయ రహదారుల నిర్వహణను ఆధునికంగా మార్చేందుకు నెట్వర్క్ సర్వే వెహికల్స్‌ను వినియోగిస్తున్నారు. 3డీ లేజర్ సిస్టమ్స్, 360 డిగ్రీల కెమెరాలతో కూడిన ఈ వాహనాలు రోడ్డుపై లోపాలను ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయి. ప్రస్తుతం 23 రాష్ట్రాల్లో 20,933 కిలోమీటర్ల మేర ఈ సర్వేలు కొనసాగుతున్నాయి.

ఫాస్టాగ్‌తో నాన్‌స్టాప్ జర్నీ

ఫాస్టాగ్ అమలుతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఫాస్టాగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇటీవల నాన్-కమర్షియల్ వాహనాల కోసం వార్షిక పాస్ సదుపాయాన్ని కూడా ప్రారంభించారు. రూ.3 వేల చెల్లిస్తే ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజాల వరకు ప్రయాణించవచ్చు. ఇప్పటికే 25 లక్షలకు పైగా వినియోగదారులు ఈ పాస్‌ను పొందారు.

మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్

దేశంలో తొలి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థను గుజరాత్‌లో ఎన్హెచ్–48పై అమలు చేశారు. బారియర్ లేకుండా, కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ వాహనం వెళ్తుండగానే ఫాస్టాగ్, నంబర్ ప్లేట్‌ను గుర్తించి టోల్ వసూలు చేస్తుంది. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణం మరింత వేగవంతం అవుతోంది. మొత్తంగా చూస్తే, హైవేలపై ప్రయాణం ఇక కేవలం సాఫీగా కాకుండా, పూర్తిగా స్మార్ట్‌గా మారుతోంది. టెక్నాలజీతో జాతీయ రహదారులు కొత్త దశలోకి అడుగుపెడుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..