
హైదరాబాద్‌లో చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్‌డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. డ్రైవర్ రజినీకుమార్‌ను అరెస్ట్ చేసి.. అత్యాచారం కేసుతో పాటు, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. కాగా డ్రైవర్‌ను కాపాడే ప్రయత్నం చేశారంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో.. స్కూల్ ప్రిన్సిపల్‌పైనా కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్షన్ 376తో పాటు పోక్సో చట్టం కింద నమోదు చేసినట్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 14లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రజినీకుమార్… కొన్నాళ్లుగా చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అలా ఎల్‌కేజీ చదువుతున్న విద్యార్థినిపై కూడా అత్యాచార యత్నం చేశాడు. గత కొన్ని రోజులుగాబాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులకు అనుమానమొచ్చింది. ఏమైందని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో చిన్నారి ఉందని, చివరకు నీరసంగా ఉండి ఏడవడంతో అసలు విషయం తెలిసిందని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు.
కాగా ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ గా ఉన్న వ్యక్తి డిజిటల్ క్లాస్ రూమ్ లోకి వచ్చి చిన్న పిల్లలను ఇబ్బందులు గురి చేస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. చాలా మంది పిల్లలు డ్రైవర్ రజినీకుమార్ ను చూసి భయపడుతున్నారని, డ్రైవర్ రజినికుమార్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా మంగళవారం (అక్టోబర్18) డ్రైవర్‌ను స్కూలు ఆవరణలోనే డ్రైవర్‌ను చితక్కొట్టారు బాధితురాలి తల్లిదండ్రులు. అసలు విషయం వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అత్యాచారం కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదుచేశారు. కాగా ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని అందరూ కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..