తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకుండా సీఎం కేసీఆర్ తెలంగాణ అమర వీరులను ఘోరంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎం అంటే కేసీఆర్ కు భయమని, అందుకే తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదని విమర్శించారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట మరో జమ్మిక్కుకు ప్లాన్ చేస్తున్నారని ఆక్షేపించారు. విమోచన దినం కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ (BJP) మాత్రమేనని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
కేసీఆర్ నిజమైన తెలంగాణ వాది అయితే తక్షణమే విమోచనోత్సవాలు నిర్వహించాలి. అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ సీఎం పీఠమెక్కాక ఆ అవసరమే లేదంటూ మాట తప్పడం దుర్మార్గం. తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడానికి అసలు కారణమేంటో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఎంఐఎం పార్టీకి భయపడి సీఎం తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటు. ఇచ్చిన మాట మేరకు సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
– బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
కాగా.. తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. 0ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా గౌరవ వందనం స్వీకరించనున్నారు. గతంలో నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పలు జిల్లాలు ఉండటంతో వారిని కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకు సన్నాహాలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..