
హైదరాబాద్‌లో వేసవి కాలం వస్తే నీరు ఎంత కటకటగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గొంతు తడపుకోడానికే నీరు దొరకని పరిస్థితి ఉంటుంది. ఎంతోమంది నీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుని వినియోగించుకుంటారు. అందుకే నీటిని పొదుపుగా వాడుకోమని జలమండలి విభాగం పదే పదే చెబుతుంది. వినియోగంలో జాగ్రత్త పాటించాలని ఎన్నిసార్లు సూచిస్తున్నా… కొందరు మాత్రం అలవాటైన నిర్లక్ష్యం విడవట్లేదు. తాజాగా బంజారాహిల్స్‌లో జరిగిన ఒక ఘటన అందుకు నిదర్శనం. రోడ్డు నెంబర్ 12లో ప్రభుత్వ తాగునీటిని కారు కడగడానికి ఉపయోగిస్తోన్న వ్యక్తిని జలమండలి టీం ప్రత్యక్షంగా గుర్తించింది. ఆ సమయంలో పర్యటిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డికే ఆ దృశ్యం కనిపించడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన పరిస్థితి. ప్రజలు నిమిషానికోసారి డ్రింకింగ్ వాటర్ కోసం ఎదురుచూస్తుంటే.. ఇలా వాహనాలు కడగటానికి వినయోగించడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. క్షణమే ఆ వ్యక్తికి రూ.10,000 జరిమానా విధిస్తూ కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ నీటి సరఫరాలో ఒడిదుడుకులు ఉన్న పరిస్థితుల్లో… తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
జలమండలి అధికారులు కూడా పౌరులకు కొత్తగా సూచనలు విడుదల చేశారు. తాగునీటిని స్నానాలకు, మొక్కలకు నీరు పోయడానికి, వాహనాలు కడగటానికి వాడితే అది చట్టపరంగా నేరమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు గుర్తిస్తే కేవలం ఫైన్‌తో ఆగేది కాదని.. అవసరమైతే నీటి కనెక్షన్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పర్యవేక్షణ మరింత కఠినతరం చేసిన జలమండలి… నీటి వృథాను అరికట్టడమే లక్ష్యంగా భారీ డ్రైవ్ ప్రారంభించింది. తాజాగా బంజారాహిల్స్‌లో తీసుకున్న చర్యను … నగరంలోని ప్రతి ఇంటికీ ఒక సందేశం అని చెబుతోంది. తాగునీటి విలువను గుర్తుపెట్టుకొని ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Fine Amount
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..