తెలంగాణ ఇంటర్ బోర్డు జరిగిన అవకతవకలపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారు అఖిలపక్షం నేతలు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు కలిసి ఇంటర్ బోర్డు ముట్టడించాలని నిర్ణయించాయి. ఇంటర్ ఫలితాల్లో దొర్లిన తప్పుల వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 29న అన్ని పార్టీలు… ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి జనసేన సైతం మద్దతు పలికింది. ఆదివారం అఖిలపక్ష నాయకులు ఎల్ రమణతో పాటు సీపీఐ, టీజేఎస్ నాయకులు పలువురు విద్యార్థుల కుటుంబాల్ని పరామర్శించారు.
మరోవైపు, ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఇవాల్టీ నుంచి నిరవధిక నిరసన దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని తొలగించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే నెల 2న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్టు బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు తెలిపారు. విద్యార్థుల మరణాలకు కారణమైన గ్లోబరీనా… దానివెనుక ఉన్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.