పండక్కి ఊరెళ్తున్నారా..ఇల్లు జాగ్రత్త..! వెళ్లే ముందు మాకు సమాచారం ఇవ్వండిః పోలీసులు

|

Jan 12, 2021 | 8:20 AM

సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో మరింత గస్తీ పెంచుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.

పండక్కి ఊరెళ్తున్నారా..ఇల్లు జాగ్రత్త..! వెళ్లే ముందు మాకు సమాచారం ఇవ్వండిః పోలీసులు
Follow us on

Hyderabad Police Alert : సంక్రాంతి పండగను సొంత ఊళ్లో జరుపుకోవడానికి వెళ్తున్నారా… అయితే, తిరిగి వచ్చే వరకు మీ ఇంటిని జాగ్రత్తగా పెట్టుకుని వెళ్లండి.. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు హైదరాబాద్ మహానగర పోలీసులు. పండక్కి ఊరెళ్లే వాళ్లు జాగ్రత్తగా తమ ఇళ్లకు తాళాలు వేసుకోవాలని, ఇళ్లల్లో విలువైన వస్తువులను ఉంచవద్దని అపార్టుమెంట్లలో ఉండేవారు ఊరెళ్లేటప్పుడు తమ వాచ్‌మెన్‌కు సమాచారం ఇచ్చి వెళ్లాలని చెబుతున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో మరింత గస్తీ పెంచుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఎమాత్రం అనుమానం ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు. ఈ పరిస్థితుల్లో నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు, స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు ప్రత్యేక ప్రచారాన్ని చేపడుతున్నారు. సంక్రాంతి పండుగను సంతోషంగా గడిపేందుకు పోలీస్ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రచారం చేస్తున్నారు.

సాధారణంగా తాళాలు వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తుంటారు. మనం ఊరెళ్లినా, డ్యూటీకి వెళ్లినా ఇంటికి తాళం వేయడం తప్పనిసరి. కానీ, దొంగలు ఎంతటి తాళాలనైనా ఇట్టే బ్రేక్ చేయగల నేర్పరులు ఉన్నందున కచ్చితంగా సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలంటున్నారు పోలీసులు. ఇంట్లో ఉండే విలువైన వస్తువులు, ముఖ్యంగా నగలు, నగదును తెలిసిన వారి వద్ద గానీ, బ్యాంక్ లాకర్లలో గానీ దాచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, ఇంటికి వేసిన తాళం కనబడకుండా డోర్‌ కర్టన్‌ వేయాలని, ఇంటిని పరిశీలిస్తుండాలని పక్కింటి వారికి చెప్పాలని పోలీసు తెలిపారు. ఊరెళ్లేముందు కాలనీ పేరు, ఫోన్‌ నంబర్‌ సమీప పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చి వెళ్లాలని పోలీసు చెబుతున్నారు. కాగా, అయా కాలనీల్లో అనుమానాస్పదంగా తిరిగే వారి వివరాలను స్థానికులు పోలీసులకు ఇవ్వాలని కోరారు. కాలనీ సంక్షేమ సంఘాల వారు యువకులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా రాత్రి వేళలో గస్తీని ఏర్పాటు చేసుకుంటే మంచిదని పోలీసులు చెబుతున్నారు.

అలాగే, వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని ఇంటికి చేరుకుంటే మరీ మంచిదంటున్నారు. సీసీ కెమెరాలను అమర్చుకున్నావారు వాటి పనితీరును ఒక్కసారి చెక్ చేసుకుని వెళ్తే మంచిందని నగర పోలీసులు సూచిస్తున్నారు. బస్తీల ప్రజలతో పాటు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు వారి వాచ్ మెన్‌లతో వచ్చి పోయే వారి వివరాలను నమోదు చేయాలని చెప్పండి. అనుమానితులపై డయల్ 100 కు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి… Chinese manja Banned: చైనా మాంజాపై అటవీ శాఖ నిషేధం.. అమ్మినా.. కొన్నా.. ఏడేళ్ల జైలు శిక్ష..!