
హైదరాబాద్, జనవరి 30: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డలో అర్హత లేని నకిలీ డాక్టర్ బానోతు శ్రీనును ఏసీబీ ఉప్పల్ జోన్ టీమ్ అరెస్టు చేసింది. అంజలి ఫస్ట్ ఎయిడ్ & క్లినిక్, మెడికల్ షాప్‌ను రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతూ UB డాక్టర్ సర్టిఫికెట్లు లేకుండా చికిత్సలు అందిస్తున్నాడని తేలింది. ఎస్ఓటీ ఉప్పల్ జోన్ టీమ్ దాడి చేసి బానోతు శ్రీనును పట్టుకున్నారు. ప్రిస్క్రిప్షన్ బుక్స్ (20), స్టెతోస్కోప్ (1), BP చెక్ మెషిన్, సిరింజెస్ (30), పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ (5), పవర్ సేఫ్ యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు (35), పారాసెటమాల్ ఇంజెక్షన్లు (30), RL బాటిల్స్ (2), గ్లూకోజ్ నీడిల్స్ (5), ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ & టాబ్లెట్స్ (4) సీజ్ చేశారు. సదరు నకిలీ గాడిపై కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
తెలంగాణలో నకిలీ డాక్టర్ల సమస్య తీవ్రంగా ఉంది. రెండు రోజుల క్రితమే మేడ్చల్ మేడిపల్లిలో రూప్ సింగ్ అనే నకిలీ డాక్టర్ తప్పుడు ఇంజెక్షన్లతో పి.ఎల్లో (56) మరణానికి కారణమై రిమాండ్‌కు గురయ్యాడు. కుత్బుల్లాపూర్‌లో నకిలీ టాబ్లెట్లు అమ్మకాలపై దాడులు జరిగాయి. ఇలాంటి ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతూ, ప్రాణాలను తీస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లోనూ నకిలీ డాక్టర్ల బెడద ఎక్కువైంది. రోజుకో మూల ఈ నకిలీగాళ్ల దురాగతాలు బయటపడుతున్నాయి. దీనిపై ప్రజల్లో అవగాహన పెరగాలి. వైద్య అర్హతలు లేని వారి వద్ద చికిత్స తీసుకోవద్దని, డ్రగ్స్ కంట్రోల్ విభాగం ద్వారా ఫార్మసీలు చెక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సిటీలో తిష్టవేసిన నకిలీ డాక్టర్లపై పోలీసులు మరిన్ని దాడులు చేస్తామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.