హైదరాబాద్ (Hyderabad) లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ ప్లై ఓవర్ పై లారీలో మంటలు ఎగిసిపడ్డాయి. ఏపీ 26టీ 9117 నంబర్ గల లారీ ఎల్బీ నగర్ నుంచి మిథానీకి బయల్దేరింది. ఫ్లై ఓవర్ పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ లారీని ఆపి అందుల నుంచి బయటకి వచ్చాడు. నంతరం లారీలో మంటలు వేగంగా వ్యాపించాయి. ముందు భాగం క్యాబిన్ లో మంటలు పూర్తిగా అంటుకున్నాయి. ఎగిసిపడుతున్న మంటల ధాటికి క్యాబిన్ భాగం అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న స్థానికులు, వాహనదారులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మటంలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే.. ఫ్లై ఓవర్ పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. దీంతో రోడ్డు వెంట ఉండే ప్రజలు, దుకాణాదారులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం స్పందించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం…