AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!

పార్కింగ్‌ విషయమై తరచూ గొడవలు నిత్యం ఏదో ఒక మూల జరుతూనే ఉంటాయి. తాజాగా ఓ అపార్ట్‌మెంట్ వద్ద జరిగిన ఘర్షణలో ఏకంగా ఒకరు ప్రాణాలే కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి ఠాణా పరిధిలో మే 21న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..

Hyderabad: కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!
Car Parking Dispute
Srilakshmi C
|

Updated on: May 30, 2025 | 5:34 PM

Share

హైదరాబాద్‌, మే 30: సిటీలో జీవనం అంటే ఆషామాషీ కాదు. ప్రస్తుతం సర్వత్రా ప్లాట్‌ కల్చర్‌ నడుస్తుంది. అయితే అపార్టుమెంట్‌లో సర్వసౌఖ్యాలు సమకూర్చే యజమానులు ఒక్కోసారి పార్కింగ్‌కు సరిపడా స్థలం చూపించరు. దీంతో పార్కింగ్‌ విషయమై తరచూ గొడవలు నిత్యం ఏదో ఒక మూల జరుతూనే ఉంటాయి. తాజాగా ఓ అపార్ట్‌మెంట్ వద్ద జరిగిన ఘర్షణలో ఏకంగా ఒకరు ప్రాణాలే కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి ఠాణా పరిధిలో మే 21న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి (48) వృత్తిరిత్యా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఆయన కుటుంబంతోపాటు గత 13 ఏళ్లుగా కొత్తపేట వైష్ణవి రుతిక అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. అదే అపార్టుమెంట్‌ ఫ్లాట్‌ నంబరు 402లో అద్దెకు ఉంటున్న సూరి కామాక్షి ఇంటికి తాజాగా ఆమె అల్లుడు కృష్ట జివ్వాజి వచ్చారు. కృష్ణ పని నిమిత్తం రాజమండ్రి నుంచి వచ్చాడు. దీంతో అతడు తన కారును అపార్టుమెంట్‌ ఆవరణలోని పార్కింగ్ స్థలంలో పార్క్‌ చేశాడు. ఆ సమయంలో బయటకు వెళ్లిన నాగిరెడ్డి కాసేపటి తర్వాత అపార్ట్‌మెంట్‌కు తిరిగొచ్చాడు. అయితే నాగిరెడ్డి తన కారును కృష్ణ కారు వెనక స్థలంలో పార్క్‌ చేశాడు.

ఇంతలో కృష్ణ తిరుగు ప్రయాణం కోసమని కిందికి వచ్చాడు. ఈ క్రమంలో తన కారుపై గీతలు ఉండటం గమనించి.. అందుకు తన కారువెనక పార్క్‌ చేసిన నాగిరెడ్డి కారు కారణమని భావించాడు. దీంతో అతడు వాచ్‌మెన్‌తో చెప్పి నాగిరెడ్డిని కిందికి రప్పించాడు. నాగిరెడ్డి రావడంతోనే కృష్ణ అతడిపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో నాగిరెడ్డి చెవిలోంచి రక్తం, నోటి నుంచి నురగ కక్కుతూ కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నాగిరెడ్డి స్పృహ తప్పగానే కృష్ణ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి అత్త కామాక్షి ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి ఉడాయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇంత జరిగినా పోలీసులు నిందితుడిని అరెస్టు చేయకపోవడాన్ని అపార్టుమెంట్‌ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.