హైదరాబాద్, డిసెంబర్ 23: వెల్డింగ్ పనులు చేసుకునే ఓ వ్యక్తి ప్రేమ.. అతడి ప్రాణాలను హరించింది. ఓ ఇంటికి వెల్డింగ్ పనికి వెళ్లిన యువకుడు ఇంటి యజమాని కుమార్తెను ప్రేమలోకి దింపాడు. ఈ విషయం తెలుసుకున్న యజమాని సదరు యువకుడిని ఇంటికి పిలిపించి పెళ్లి చేస్తామని చెప్పాడు. ఈ క్రమంలో ఆ ఇంటి ముందు కూర్చున్న యువకుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్థరాత్రి కలకలం సృష్టించింది. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్సై శివశంకర్‌లు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి అలీ కాంప్లెక్స్ సమీపంలో నివసించే మహమ్మద్ సమీర్ (25) వెల్డింగ్ పని చేస్తుంటాడు. గతేడాది నాచారంలో ఓ భవనానికి సంబంధించి వెల్డింగ్ పని చేయడానికి వెళ్లిన సమీర్ సదరు భవనం యజమాని కుమార్తెను ప్రేమించాడు. ఆ సమయంలో యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వారి పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఈ ఏడాది జనవరిలో ఆ అమ్మాయిని తీసుకొని అస్సాంకు వె.. అక్కడ ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం అక్కడే 20 రోజులపాటు ఉన్నాడు. అయితే ఈ వివాహం గురించి తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వారిని సంప్రదించి.. వారికి వివాహం చేయిస్తామని నమ్మబలికి తిరిగి ఇంటికి వచ్చేలా చేశారు.
వీరి మాటలు నమ్మిన జంట హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. అనంతరం సమీర్‌ను సంప్రదించి యువతికి తలాక్ ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారు. పైగా యువతికి బలవంతంగా మరో వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేయించారు. సమీర్ అడ్డుకునే ప్రయత్నాలు చేశాడు. అతనిపై కోపం పెంచుకున్న యువతి సోదరుడు ఉమర్.. సమీర్ హత్యకు కుట్రపన్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 21న అర్ధరాత్రి దాటాక సమీర్ ఆరుబయట కూర్చుని ఉండగా.. ఉమర్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి ద్విచక్రవాహనాలపై వచ్చి.. సర్జికల్ బ్లేడ్లు, కత్తులతో సమీర్‌పై విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సమీర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, మార్చురీకి తరలించారు. ఘటనా స్థలంలో దాడికి వినియోగించిన ఓ కత్తికి సంబంధించిన కవర్ పోలీసులకు లభించింది. దుండగులు మాస్కులు ధరించి ఉన్నారని, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు హత్య జరిగిన కొద్దిసేపటికే యువతి కుటుంబసభ్యులు ఇంటికి తాళాలు వేసుకుని పరారయ్యారు. దీంతో సమీర్ హత్య వెనుక యువతి కుటుంబ సభ్యులున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువతి సోదరుడు ఉమర్ నిజామాబాద్ పారిపోయాడని తెలుసుకున్న పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారమివ్వగా వారు అతణ్ని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు సమీర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.