ఫుల్ టైం ఐటీ రిక్రూటర్.. పార్ట్ టైం ఈ గలీజ్ దందా..!

హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ విక్రయానికి యత్నించిన ఇద్దరిని బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిని రాజేంద్రనగర్‌కు చెందిన అన్వర్ హుస్సేన్ (33), బండ్లగూడ జాగీర్‌కు చెందిన బుర్ర సంపత్ (31)గా పోలీసులు గుర్తించారు.

ఫుల్ టైం ఐటీ రిక్రూటర్.. పార్ట్ టైం ఈ గలీజ్ దందా..!
West Zone Hyderabad

Edited By:

Updated on: Jan 16, 2026 | 10:04 PM

పండుగ పూట పోలీసులు పెద్దగా పట్టించుకోరు అనుకున్నారేమో.. బహిరంగంగానే గబ్బు పనికి పూనుకున్నారు. కానీ, పోలీసులు వారి ఆట కట్టించి.. కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ విక్రయానికి యత్నించిన ఇద్దరిని బుధవారం (జనవరి 14) అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిని రాజేంద్రనగర్‌కు చెందిన అన్వర్ హుస్సేన్ (33), బండ్లగూడ జాగీర్‌కు చెందిన బుర్ర సంపత్ (31)గా పోలీసులు గుర్తించారు.

అన్వర్ హుస్సేన్ ఐటీ రిక్రూటర్‌గా, సంపత్ కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు. తమ ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు డ్రగ్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన చరణ్ అనే డ్రగ్ పెడ్లర్‌ను సంప్రదించి, జనవరి 8న రూ.38 వేలను అతనికి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సప్లై చేస్తానని హామీ ఇచ్చిన చరణ్ నుంచి మాదకద్రవ్యాలను తీసుకుని ఇతరులకు విక్రయించాలని వారు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.

ఈలోపే సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 గ్రాముల ఎండీఎంఏ, 0.8 గ్రాముల ‘ఓజీ’ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా చేసిన బెంగళూరు పెడ్లర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.