
గ్రేటర్ హైదరాబాద్‌లో పాతాళగంగ భయంకరమైన కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. నగరం నడిబొడ్డున సికింద్రాబాద్ ప్రాంతాల్లోని చిలకలుగూడలో కలుషిత నీటి సమస్యతో బస్తీ వాసులు ఆసుపత్రిపాలవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మంచినీళ్ల పైప్ లైన్ డ్రైనేజ్ పైప్ లైన్ రెండు కలిపి ఉండడం వల్ల నీరు కలుషితమైందని అంటున్నారు. విశ్వనగరం.. స్మార్ట్‌సిటీ.. ఆకాశ హార్మ్యాలు.. భవిష్యత్‌లో చారిత్రక భాగ్యనగరిలో పురుడుపోసుకోనున్న అభివృద్ధి. విశ్వ ప్రణాళికలతో నాయకులు అరచేతిలో చూపిస్తున్న స్వర్గం ఇది. మరి మహానగరిలో పరిస్థితులు ఇలానే ఉన్నాయా.? కానే కాదు.. నగరం కన్నీటి కష్టాల కడలిలో ఈదుతోంది. స్వచ్ఛమైన గుక్కెడు నీళ్లు దొరక్క గుండెలు బాదుకుంటోంది. మంచినీరు మహాప్రభో.. అంటూ ఘోష పెడుతోంది. మంచినీటిలో డ్రైనేజీ కలుస్తోంది. నెలలుగా కలుషిత జలాలే సరఫరా అవుతున్నాయి. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం లేదు. దిక్కులేని పరిస్థితుల్లో ఈ కలుషి నీరే తాగుతున్నారు.
హైదరాబాద్‌లో కలుషిత తాగు నీరు కలకలం సృష్టిస్తోంది. కలుషిత నీరు తాగి ఏకంగా 100 మంది ఆస్పత్రిపాలు కావటం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సికింద్రాబాద్ చింతబావిలో కలుషిత మంచి నీటి సరఫరా కారణంగా స్థానికులు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. చింతబావిలో గత మూడు రోజులుగా కలుషిత నీటి సరఫరా జరుగుతుండగా.. ఆ నీటిని తాగిన స్థానికులకు.. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో స్థానికులు స్థానిక బస్తీ దవఖానాలో చేరుతున్నారు. సరఫరా చేసే తాగునీటిలో మురుగు కలిసి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఇదే సమస్య ఉంటున్నా ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోవడం లేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేస్తున్నామని చెబుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చింతబావి ప్రాంతంలో దాదాపుగా 1500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందులో రమాబాయి బస్తీలో 200కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారందరికీ కూడా పూర్తి కలుషితమైన నీరు సప్లై అవుతుందని అంటున్నారు. అయితే నిజంగా సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9. ఇది చూడండి.. ఈ గాజు గ్లాసులో ఉన్న నీళ్లు ప్రభుత్వం సరఫరా చేస్తున్న మంచినీళ్లు. శుద్ధమైన, సురక్షితమైన మంచినీరు సరఫరా కావాల్సిన పంపుల్లో కంపు నీరు వస్తుందన్న విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ రంగు మారిన నీళ్లనే బస్తీవాసులు మంచినీళ్లుగా వాడుతున్నారు.
గత మూడు నాలుగు రోజులుగా బస్తీ దవాఖానకు డయేరియా కేసులు ఎక్కువయ్యాయని వైద్యులు అంటున్నారు. ఉన్నపలంగా కేసులు పెరగడానికి ప్రధాన కారణం.. కలుషిత ఆహారం, కలుషిత నీరేనని డాక్టర్లు చెబుతున్నారు.
సమస్య తీవ్రం కావడంతో మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఏరియాకు సప్లై అవుతున్న వాటర్ పైప్లైన్స్‌ను స్కానింగ్ ఎక్విప్మెంట్ ద్వారా పరిశీలించారు. నీరు కలుషితం అవుతుందని గుర్తించారు.
పైప్లైన్ వ్యవస్థ వల్ల అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక కార్పొరేటర్ సునీత టీవీ9తో తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం ఫండ్స్ కేటాయించామని… త్వరలోనే ప్రత్యేక వాటర్ పైప్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
నీటి సరఫరాపై ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నీటి సరఫరా తీరుపై కిందిస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించకపోవడంతోనూ సమస్య తీవ్రమైందని తెలుస్తోంది. ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వస్తే ఉన్నతాధికారులు తమ కార్యాలయాల్లో కూర్చోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనివల్ల పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఉన్నాధికారులు కిందిస్థాయిలో ఏం జరుగుతుందోనన్న దానిపై నిఘా పెడితే జనానికి ఇబ్బందులు ఉండవు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..