ఇప్పుడంతా స్మార్ట్.. టెక్నాలజీ మయం! అరచేతిలోనే ప్రపంచం. అవును.. టెక్నాలజీ పెరిగింది. కానీ.. అదే రేంజ్‌లో సైబర్ నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడో కూర్చొని టెక్నాలజీ సహాయంతో జనాలను ఇట్టే మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇన్వెస్ట్‌మెంట్, ఇతర పేర్లతో కోట్ల రూపాయలను కొళ్లగొడుతున్నాయి ముఠాలు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనూ సైబర్‌క్రైమ్ నేరాలు పెరిగిపోవడంతో దానిపై దృష్టిపెట్టారు పోలీసులు. ఈ ముఠాల కోసం వేట మొదలుపెట్టిన సైబర్ క్రైమ్ పోలీసుల గుట్టరట్టు చేశారు. సైబర్ ముఠాలకు అకౌంట్స్ సప్లయ్ చేస్తున్న వారితో పాటు అకౌంట్ హోల్డర్లలను విచారించి డబ్బు రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూ. 175 కోట్ల కుంభకోణానికి పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఎన్‌సిఆర్‌పి పోర్టల్‌లో డేటా విశ్లేశించగా, ఎస్‌బీఐ, షమ్‌షీర్‌గంజ్ శాఖలోని ఆరు బ్యాంకు ఖాతాల ఫిర్యాదులను గుర్తించింది. ఈ ఖాతాల ద్వారా రెండు నెలల స్వల్ప వ్యవధిలో పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఖాతాదారులు పెద్ద ఎత్తున సైబర్ మోసాలకు పాల్పడి అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ ఖాతాలకు దాదాపు 600 ఫిర్యాదులు లింక్ గుర్తించారు.
ప్రధాన నిందితుడు దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు సైబర్ పోలీసలు గుర్తించారు. అతనికి చెందిన ఐదుగురు సహచరులు పేద ప్రజలను బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, సైబర్ నేరాలు, హవాలా కార్యకలాపాలకు కమీషన్ ప్రాతిపదికన ఉపయోగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు ఖాతాలు తెరవడంలో అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేయడంలో షోయిబ్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు. ఖాతాలు తెరిచిన తర్వాత, చెక్కులపై ఖాతాదారుల సంతకాలు చేయించాడు. ఆపై వాటిని సహచరులలో ఒకరి కస్టడీలో ఉంచారు. కొంత డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్‌కి పంపించారు. ప్రధాన నిందితుడి ఆదేశాలను అనుసరించి సహచరులు డబ్బును విత్డ్రా చేశారు.
షోయిబ్ తోపాటు ఇతర సహచరులు కొంతమంది పేద వ్యక్తులను ఫిబ్రవరి 2024లో SBI షమ్‌షీర్‌గంజ్ బ్రాంచ్‌లో ఆరు కరెంట్ ఖాతాలను తెరిచేందుకు ఒప్పించి, కమీషన్‌లతో ఆశ చూపించారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో, ఈ ఆరు ఖాతాలలో రూ. 175 కోట్లు లావాదేవీలు గుర్తించారు సైబర్ పోలీసులు. సైబర్ నేరగాల కోసం పనిచేసిన మహ్మద్ షాహిబ్, బిన్ హమాద్ లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. వేరొకరి కోసం బ్యాంకు ఖాతా తెరవవద్దని, అనుమానాస్పద లావాదేవీలలో పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నారు. బ్యాంకు ఖాతాలను తెరవడానికి అయాచిత ఆఫర్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఖాతాను తెరవమని, ఖాతా కార్యకలాపాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించమని పోలీసులు సూచిస్తున్నారు. పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఇటీవల సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఓటీపీ, లింక్ ల పేరుతో క్షణాల్లోనే కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..