ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. టికెట్ ధరలపై 30 శాతం రాయితీ ప్రకటించిన ఆర్టీసీ!

ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌ కొరత నేపథ్యంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరడం కన్నా..సేఫ్‌గా బస్ ఎక్కి సుఖవంతమైన ప్రయాణం చెయ్యండని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30శాతం రాయితీ కల్పిస్తున్నట్టు ప్రకటించింది.

ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. టికెట్ ధరలపై 30 శాతం రాయితీ ప్రకటించిన ఆర్టీసీ!
Tsrtc Discount Offer

Edited By:

Updated on: Mar 25, 2026 | 2:08 PM

ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండి నాగిరెడ్డి ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు ఉండగా.. పెట్రోల్ ఇబ్బందులు పడటం ఎందుకు దండగ.. అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులు సమయం, ఇంధనం, క్యూ లైన్లకు స్వస్తి చెప్పవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు.

ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రతి చుక్క పెట్రోల్ విలువైనదే. వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని ఆయన తెలిపారు.రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు.

సాధారణంగా ఏసీ బస్సులు ఖరీదు అనుకునే వారికి 30శాతం రాయితీ ఒక గొప్ప అవకాశమని తెలిపారు. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకుని, అతి తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని ఆయన తెలిపారు. ఇది సామాన్యుడి జేబుకు, ప్రయాణానికి ఎంతో హాయినిస్తుంది. బంకుల వద్ద బారులు తీరొద్దు.. సేఫ్ గా బస్సెక్కండి. సుఖవంతమైన ప్రయాణం చెయ్యండి అని నాగిరెడ్డి నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ట్రాఫిక్, పెట్రోల్ ఇబ్బందుల నుండి బయటపడాలని టీజీఎస్ఆర్టీసీ ఆకాంక్షిస్తోందని ఎండీ నాగిరెడ్డి చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us