AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అండాల సేకరణ కేసులో దర్యాప్తులో కీలక విషయాలు.. మహిళలకు హార్మోనల్ ఇంజెక్షన్లు

అండాల సేకరణ వెనుక అసలు నెట్‌వర్క్‌ ఏంటి..? మహిళలను ఎవరు టార్గెట్‌ చేశారు..? వారి అండాలతో ఏం చేస్తున్నారు..? ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న కొద్దీ ఈ వ్యవహారంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి..! పైకి అంతా నిబంధనల ప్రకారమే కనిపిస్తున్నా.. తెరవెనుక మాత్రం ఇంకేదో జరుగుతోంది. అండాల సేకరణ నుంచి ఆసుపత్రుల లింకుల వరకు ఎన్నో చిక్కుముడులు కనిపిస్తున్నాయి! చివరకు అర్హత పత్రాల విషయంలోనూ అక్రమాల ఆనవాళ్లు బయటపడుతున్నాయి..! అసలు పోలీసుల విచారణలో బయటపడుతున్న సంచలనాలేంటి..?

అండాల సేకరణ కేసులో దర్యాప్తులో కీలక విషయాలు..  మహిళలకు హార్మోనల్ ఇంజెక్షన్లు
Illegal Egg Donation Case
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2026 | 7:53 AM

Share
హైదరాబాద్‌లో వెలుగుచూసిన అక్రమ అండాల సేకరణ కేసులో దర్యాప్తు కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తొలుత పోలీసులకు అందిన సమాచారం ఒకటి.. విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు మరొకటి..! వ్యభిచార రాకెట్‌గా భావించి మొదలుపెట్టిన విచారణ.. చివరకు అక్రమ అండాల సేకరణ గుట్టును బయటపెట్టింది..! అసలు మహిళలను ఈ వ్యవహారంలోకి ఎలా తీసుకొచ్చారు..? వారి నుంచి అండాలను ఏ పద్ధతిలో సేకరించారు..? అన్నదానిపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. మహిళలకు హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరించారా..? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లను ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. మరోవైపు ఏఆర్టీ కేంద్రాలు, ఫెర్టిలిటీ సెంటర్ల మధ్య ఉన్న సంబంధాలపైనా దృష్టి పెట్టారు. ఏఆర్టీ కేంద్రాల ద్వారా బాధిత మహిళలను ఎలా సంప్రదించారు..? ఈ ప్రక్రియలో ఎవరెవరి పాత్ర ఉంది..? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

మూడు ఆసుపత్రులు.. మూడు ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు

ఇప్పటికే మూడు ఆసుపత్రులు, మూడు ఫెర్టిలిటీ సెంటర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మరో 22 ఫెర్టిలిటీ సెంటర్లతో ఏఆర్టీ కేంద్రాలకు ఉన్న సంబంధాలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి వ్యవహారంపై తొలిసారిగా సమాచారం అందడంతో అప్రమత్తమై దర్యాప్తు చేపట్టినట్లు సీపీ సుమతి వెల్లడించారు. తల్లి కావాలని కోరుకునే వారు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నప్పటికీ.. అండాలను ఏ విధంగా సేకరిస్తున్నారు? ఆ ప్రక్రియ చట్టబద్ధంగా జరుగుతోందా? అనే అంశాలను పట్టించుకోవడం లేదన్నారు.

పెళ్లి కాకపోయినా పెళ్లయినట్టు ధ్రువీకరణ పత్రాల సమర్పణ?

ఈ వ్యవహారంలో మరో చిక్కుముడి డాక్యుమెంట్లు..! ఎగ్ డొనేషన్‌కు అర్హత నిర్ధారించే పత్రాల్లోనే తప్పుడు వివరాలు ఇచ్చారా..? పెళ్లి కాకపోయినా పెళ్లయినట్లు.. భర్త లేకపోయినా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారా..? అన్నది పోలీసులు పరిశీలిస్తున్నారు. విచారణలో ఈ తరహా అక్రమాలు బయటపడితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.

Follow Us