Hyderabad: హాస్టళ్ల ముసుగులో అమ్మాయిల అండాలతో దందా.. అసలు సూత్రధారులు వీరే..
డబ్బులు ఇస్తామంటూ పేద యువతులకు ఆశ చూపించడం.. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడం.. వారి నుంచి అక్రమంగా అండాలు సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయించడం..! హైదరాబాద్‌లో ఓ ముఠా సాగిస్తున్న ఈ దందా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది.

హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి శెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పేరుతో హాస్టల్ నిర్వహిస్తూ.. వివిధ రాష్ట్రాలకు చెందిన పేద యువతులను డబ్బు ఆశ చూపించి హైదరాబాద్‌కు రప్పించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ ఉంటున్న యువతుల నుంచి నెలనెలా అండాలు సేకరించి, వాటిని అధిక ధరలకు ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు దాడులు నిర్వహించి దుర్గాప్రసాద్‌తో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. హాస్టల్‌లో ఉన్న 15 మంది యువతులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం వారిని రక్షణ గృహాలకు పంపించారు.
ఈ ముఠా కార్యకలాపాలు తొలుత బేగంపేటలోని ప్రకాష్‌నగర్‌లో బయటపడ్డాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 8 నుంచి 10 మంది యువతులను ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంచి అండాలు సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది నుంచే ఈ దందా కొనసాగుతున్నట్లు విచారణలో తేలింది. అమీ నీతా గర్ల్స్ హాస్టల్ పేరుతో అక్కడ కార్యకలాపాలు సాగించినట్లు సమాచారం. ఈ కేసులో లభించిన ఆధారాలతో పోలీసులు సరూర్‌నగర్‌లోనూ దాడులు నిర్వహించారు.
మహిళల అండాల అక్రమ సేకరణ వ్యవహారంపై మల్కాజ్‌గిరి సీపీ సుమతి కీలక వివరాలు వెల్లడించారు. ఈ దందాలో ఇందౌర్‌కు చెందిన అమిత్ శర్మ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. బేగంపేటకు చెందిన నిఖత్ పర్వీన్‌ను రిక్రూటర్‌గా, రెజిమెంటల్ బజార్‌కు చెందిన రేష్మా ఖతూన్‌ను ఐవీఎఫ్ ఏజెంట్‌గా గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా బెంగాల్‌లోని పేద మహిళలను టార్గెట్ చేసి ఈ నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అండాలను కొనుగోలు చేస్తున్న ఫెర్టిలిటీ సెంటర్లు, ఆసుపత్రులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందా? వాటికి అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా? అండాల సేకరణ, నిల్వ, సరఫరా ప్రక్రియలు నిబంధనల ప్రకారమే జరిగాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పేదరికాన్ని ఆసరాగా చేసుకుని యువతుల ఆరోగ్యం, హక్కులతో ఆడుకున్న ఈ ముఠా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే ఈ అక్రమ దందాకు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
