
అల్లరి చేస్తున్నాడన్న ఒకే ఒక్క కారణంతో అభం శుభం తెలియని చిన్నారిని అతి కిరాతకంగా కొట్టి హత్య చేశాడు ఓ సవతి తండ్రి. కనీస కనికరం లేకుండా పిల్లాడిన బండకేసి కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పసివాడు హాస్పిటల్‌లో చికిత్స ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పాతబస్తీ-చంద్రాయణగుట్ట పరిధిలోని ఘాజీ యే మిల్లత్ కాలనీలో ఈ దారుణం జరిగింది. నఫీసా బేగం అనే మహిళకి ఆరేళ్ల క్రితం షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తితో రెండో వివాహం జరిగింది. మొదటి భర్త తనకు దూరం కావడంతో నఫీసా తనకు తోడు ఉండాలని భావించి ఇమ్రాన్ ను ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అప్పటికే నఫీసాకు అస్గర్ అనే కొడుకు ఉన్నాడు. రెండో పెళ్లి అనంతరం ఇద్దరు దంపతులు చిన్నారి అస్గర్ ను పెంచుతూ ప్రేమగా చూసుకునేవారు. కానీ, ఎంతైనా సొంత తండ్రి ప్రేమ, సవతి తండ్రికి ఎలా వస్తుంది.. అదే ఇక్కడ ఇంతటి దారుణానికి దారి తీసింది.
అస్గర్ తన వయసు రీత్యా విపరీతంగా అల్లరి చేసేవాడు. తన అల్లరిని కట్టడి చేసేందుకు తల్లి నఫీసా ఎంతో కొంత ప్రయత్నించేది. కానీ, సవతి తండ్రి షేక్ ఇమ్రాన్ ఇది భరించలేకపోయాడు. తమ జీవితానికి ఈ చిన్నారి అడ్డు అనుకున్నాడో ఏమో.. అస్గర్ అల్లరి చేసిన ప్రతిసారి దారుణంగా కొట్టేవాడు, బెదిరించేవాడు. ఇదే క్రమంలో ఇటీవల అల్లరి చేస్తూ విసిగిస్తున్నాడన్న కారణంగా షేక్ ఇమ్రాన్.. ఆ చిన్నారి అస్గర్‌ను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. చిన్నారిని నేలపై విసిరికొట్టి దారుణంగా బాధించాడు. ఆ దెబ్బలకు తాళలేని ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ సంఘటన గత ఆదివారం జరిగింది.
ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలుడిని చూసి తల్లి వెంటనే చికిత్స నిమిత్తం బాబును హాస్పిటల్‌కు తరలించింది. హాస్పిటల్‌లో ఐదు రోజులుగా మృతువుతో పోరాడుతూ చిన్నారి అస్గర్ శుక్రవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకుని సవతి తండ్రి ఆస్పత్రికి వచ్చి చూసి.. తననేమైనా చేస్తారేమోననే భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాలుడి తల్లి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లి వద్ద నుంచి మరిన్ని పూర్తి వివరాలు రాబడుతున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.