Kaushik Reddy Resigned to Congress Party: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఆ పార్టీని వీడారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన లేఖను నేరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాశారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు అందుకున్న 24 గంటల్లోనే కౌశిక్ రెడ్డి రాజీనామా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. కౌశిక్‌రెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, టీఆర్‌ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు అందినట్లు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కోదండ రెడ్డి సంజాయిషి కోరుతూ నోటీసులో పేర్కొన్న సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక తథ్యమైన హుజూరాబాద్‌లో.. టీఆర్‌ఎస్ తనకే టికెట్ ఇస్తుందని ఫోన్‌లో కౌశిక్ రెడ్డి స్థానిక నాయకులతో చెప్తున్నట్లు ఉన్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతంలో కౌశిక్‌రెడ్డిని పీసీసీ క్రమశిక్షణా సంఘం హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మేరకు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Read Also… New Born Child: అమానుషం: స్మశానంలో శిశువు ఏడుపులు.. అట్టపెట్టలో బాలుడిని చూసి కాటికాపరి షాక్.. ఏం జరిగిందంటే..!