Huzurabad Bypoll Results: యావత్ తెలుగు ప్రపంచం చూస్తోంది. అక్కడేం జరుగుతోందా అని యావత్ రాజకీయం చూస్తోంది. హుజూరాబాద్ బాహుబలి ఎవరా అని యావత్ నేతగణం చూస్తోంది. జస్ట్ బైపోల్. ఓడితే ప్రభుత్వాలు పడిపోవు.. గెలిస్తే కొత్త పదవులు ఊడిపడవ్. అయినా సరే.. రాజకీయపార్టీలకు చావో రేవో. రేపు భవిష్యత్ దిక్చూచి ఈ ఉపఎన్నిక. 2023కు రూట్ మ్యాప్ ఈ ఉపఎన్నిక. మరి ఈ రేసులో గెలుపుగుర్రం ఎవరు..? ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.
అవినీతి ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈటల తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్ దమ్ముంటే తనను హుజురాబాద్‌లో ఓడించాలని టీఆర్‌ఎస్ నాయకత్వానికి సవాల్ విసిరారు. ఇలా సవాళ్లు, ప్రతిసవాళ్లు గడిచిన ఐదు నెలల ఉత్కంఠకు తెరదించుతూ అక్టోబర్ 30న హుజూరాబాద్ ఓటర్లు తమ తీర్పును ఇచ్చేశారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్..
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ 2న అంటే రేపు మంగళవారం నాడు వెలువడనున్నాయి. మంగళవారం జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. సుమారుగా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలు కాపలాకాస్తున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. మొదటి అరగంటపాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ఉంటుంది. మొత్తం 753 మంది పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఒక హాళ్లో 7 టేబుల్స్, మరో హాళ్లో 7 టేబుల్స్ చొప్పున ఒక్క రౌండుకు 14 ఈవీఎంల చొప్పున లెక్కిస్తారు. 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు.. వాళ్ల ఏజెంట్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సాగుతోంది. కౌంటింగ్ సిబ్బంది, సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయ్యింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది ఫలితం విడుదల కానుంది.
గత రికార్డు బద్దలుకొట్టారు..
హుజురాబాద్ ఉప పోరుకు అక్టోబర్ 30న పోలింగ్ ముగియగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, పోలింగ్ రోజున హుజురాబాద్ పోటెత్తిందా అన్నట్లుగా ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద క్యూ కట్టారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన 18 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి.. 90 ఏళ్ల పండు ముసలి వరకు అందరూ.. ఓటింగ్ సెంటర్‌లో కదం తొక్కారు. ఓటర్లలో ఒక్కసారిగా చెతన్యం వచ్చింది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన 2018 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో 84 శాతం పైగా పోలింగ్ నమోదవగా.. ఈ సారి మాత్రం 86.57 శాతం పోలైంది. అంటే గంతలో కంటే 2.5 శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. మరి ఓటర్లు ఎవరివైపు ఉన్నారో తెలియాలంటే.. రేపటి వరకు వేచి ఉండాల్సిందే.
Also read:
Viral Video: జాక్‌పాట్ కొట్టిన ఉబర్ డ్రైవర్..! అతని ఆనందానికి అవధులు లేవు.. వీడియో
Adipurush: శరవేగంగా ఆదిపురుష్ షూటింగ్ చేస్తున్న ప్రభాస్.. అందుకేనా..! వీడియో
Rice substitutes : అన్నం బదులు ఇవి తింటే షుగర్ సమస్యలు రావు…! వీడియో