ఓ సంస్థపై భర్తలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కోరుకోకపోయినా బలవంతంగా విడాకులు ఇప్పిస్తున్నారని మండిపడుతున్నారు. సాధారణంగా విడాకులు ఇవ్వాల్సి వస్తే చట్టబద్ధంగా కోర్టు ద్వారా రావాలి. కానీ సదా-ఈ-హక్ అనే సంస్థ కోర్టు పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ లో ఉన్న ఈ సంస్థను మహ్మద్ మొయినుద్దీన్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఒకప్పుడు బట్టల వ్యాపారి అయిన మొయినుద్దీన్ ఇంటినే కోర్టుగా మార్చి 2006 నుంచి ఇలా విడాకుల వ్యాపారం కొనసాగిస్తున్నాడని బాధితులు అంటున్నారు. ఎవరైనా మహిళ వెళ్లి తన భర్త నుంచి విడాకులు కావాలని అడిగితే వెంటనే భర్తకు నోటీసులు పంపిస్తున్నాడని చెబుతున్నారు.
ఒరిజినల్ విడాకుల పత్రాలను సృష్టించి జంటలను విడగొడుతున్నాడని వాపోతున్నారు. వాస్తవానికి భార్యాభర్తల బంధం మెరుగుపరచడానికి మధ్యవర్తిత్వం వహించాల్సింది ఇస్లాం మతపెద్దలైన ఖాజీ సాహెబ్‌లు. అంతే గానీ ఎలాంటి ప్రైవేట్ సంస్థలు కాదు. ఒకవేళ సమాజం పట్ల బాధ్యతతో ఎవరైనా మధ్యవర్తిత్వం వహించినా భార్య చెప్పిన మాటలే కాకుండా భర్త వివరణ కూడా తీసుకుని ఇరువురితో దఫాలుగా చర్చలు జరిపించాలి. కానీ మొయినుద్దీన్ అలా కాకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని, మొదలు నోటీసులు ఆ తర్వాత విడాకుల పత్రాలు పంపిస్తున్నాడు. భర్త నుండి ఎలాంటి డబ్బు తీసుకోకపోయినా భార్యల నుంచి మాత్రం షరియా చట్టాన్ని అడ్డుపెట్టుకుని లక్షల్లో వసూలు చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మొయినుద్దీన్ 500కిపైగా విడాకులు ఇప్పించాడు. ఈ విషయాన్ని బాధితులు హైదరాబాద్ సీపీ, కలెక్టర్, రాష్ట్ర సమాచారశాఖ, హోంమంత్రి, కేంద్ర న్యాయశాఖతో పాటు ముస్లిం మత పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు.
విచారణ జరిపిన అధికారులు సదా-ఈ-హక్ అనే సంస్థ ఓ బూటకపు సంస్థ అని తేల్చారు. మొయినుద్దీన్‌పై బాధిత భర్తలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుకూడా చేశారు. దీంతో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయి. అయినా మొయినుద్దీన్ తన కార్యక్రమాలు ఆపలేదు. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే కౌసర్ మొహీ ఉద్దీన్.. మహ్మద్ మొయినుద్దీన్‌ను పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు వివాహాలు జరిపించే ఖాజీలు సైతం విడాకులు ఇప్పించే అర్హత మనకు లేదని చెప్పినా ఆయన వినలేదు. ఇస్లాం మతపెద్దలు కూడా దేనికైనా ఓ పద్ధతి ఉంటుందని, భార్యాభర్తలను పిలిచి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చి జంటను కలిపే ప్రయత్నం చేయాలని చెప్పినా మొయినుద్దీన్ తీరు మారలేదు.
ఇస్లాం మతానికి విరుద్ధంగా వివాహాలను నిర్వీర్యం చేస్తున్నాడంటూ అతనిపై సామాజిక కార్యకర్తలు సైతం మండిపడుతున్నారు. పోలీసులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని కోరుతున్నారు. మరోవైపు రిటైర్డ్ ఐఏఎస్, ప్రభుత్వ సలహాదారులు అతని టీమ్‌లో ఉండటం వల్లే చర్యలు తీసుకోవడం లేదని బాధితులు అంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వారికి పోలీసులు, ప్రభుత్వం బుద్ధి4 చెప్పకపోతే సమాజం మరింతగా నష్టపోతుందని, చర్యలు తీసుకునేవరకు తమ పోరాటం ఆగదని బాధిత భర్తలు తెగేసి చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..