Telangana: కొమురం భీం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇళ్లలోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లారు. నగదు, నగలు ఇలా ఏవి కనిపిస్తే వాటిని ఎత్తుకెళ్లారు దుండగులు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. తాళం వేసిన ఇళ్లలోనే కాదు.. మనుషులు ఉన్న ఇళ్లలోనూ చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లలో మనుషులు ఉన్నా చోరీ చేసి చూపిస్తామంటూ బరితెగించారు దొంగలు. ఈ దోపిడీకి సంబంధించి పోలీసులు, బాధితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కాగజ్ నగర్ పట్టణంలో టీచర్స్ కాలనీ ఏరియాలో ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. అదే అదునుగా భావించిన దొంగలు.. ఇళ్లకు ఉన్న కిటికీలను తొలగించి లోపలికి దూరారు.
ఆ ప్రాంతంలోని రాజు గౌడ్ ఇంట్లో చొరబడిన దొంగలు.. నిద్రిస్తున్న మహిళల మెడలో నుంచి 5 తులాల విలువైన రెండు పుస్తెల గొలుసులు ఎత్తుకెళ్లారు. ఇక మహమ్మద్ ఇస్సాక్ ఇంట్లో బీరువాలో దాచిఉంచిన రెండు తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 20 వేల నగదును దొంగలు చోరీ చేశారు. దోపిడీపై సమాచారం అందుకున్న పోలీసులు.. చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. సీఐ రవీందర్ వచ్చి ఇళ్లను పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. దోపిడీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.