జూన్ రెండున నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అందుకు సంబంధించిన పనులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. గౌరవ వందన సమర్పణ కోసం రిహార్సల్స్ చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతోన్న ఏర్పాట్లను పరిశీలించారు సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి. వీవీఐపీలు వస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌తో జల్లెడ పతున్నారు.
ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో భారీ టెంట్ల తోపాటు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక లాంజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జూన్ రెండున ఉదయం, సాయంత్రం ఘనంగా వేడుకలు నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. జూన్ రెండున ఉదయం 10గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి చేసే జాతీయ పతాకం ఆవిష్కరణతో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు సీఎస్ శాంతకుమారి. అదేరోజు ట్యాంక్‌బండ్‌పై 5వేలమందితో ఫ్లాగ్ వాక్ నిర్వహించబోతున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ దశాబ్ది వేడుకల్లో అతిరథ మహారథులను ఆహ్వానించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా పాల్గొననున్నారు. సీఎం జెండా ఆవిష్కరణ అనంతరం ఆమె ప్రసంగించనున్నారు. ఇక, ఈ వేడుకలకు హాజరు కావాల్సిందిగా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వయంగా రేవంత్‌రెడ్డి ఆహ్వాన లేఖ రాయడం విశేషం. ఈ వ్యక్తిగత లేఖను స్వయంగా కేసీఆర్‌కు అందించాలని… ప్రొటోకాల్ సలహాదారుకు సూచించడం మరో విశేషం. అలాగే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు వివిధ పార్టీల ముఖ్యనేతలకు కూడా ఆహ్వానాలు పంపింది తెలంగాణ ప్రభుత్వం.
ఆ వేడుకల్లో తెలంగాణ గీతాన్ని అవిష్కరించనున్నారు. అందె శ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని.. రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రులు, పార్టీ సీనియర్లతో సహా మిత్రపక్షాలతో సమావేశమైన రేవంత్.. పలు సూచనలు స్వీకరించారు. రెండున్నర నిమిషాల నిడివితో ఒక వర్షన్, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ సిద్ధమైనా.. ప్రభుత్వ కార్యక్రమాల్లో మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల గీతమే ఉపయోగిస్తారు. కీరవాణి నేతృత్వంలో గాయనీగాయకులు పాడిన గీతం.. అందరినీ అలరించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..