రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక చినుకు పడితేనే చిత్తడిగా మారే హైదరాబాద్ మహా నగరం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరం అంటేనే పురాతన భవనాలు, చారిత్రాత్మక కట్టడాలకు పెట్టింది పేరు. కాగా, ప్రస్తుతం కురుస్తున్న ఈ భారీ వర్షాలకు పాత కాలం భవనాలు కూలుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న కొన్ని పేరున్న భవనాలు ఈ వర్షాలకు తమ వైభవాన్ని కోల్పోతున్న పరిస్థితి తలెత్తుతోంది.
పాతబస్తీలో ఉన్న దివాన్ దేవిడి ప్యాలెస్ ప్రధాన ద్వారము కమాన్ శుక్రవారం కురిసిన భారీ వర్షానికి కొంత భాగం కూలి కింద పడింది. అదే సమయంలో బిర్యానీ తీసుకెళ్తున్న ఓ పాదచారికి తీవ్ర గాయాలై రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, దివాన్ దేవిడి ప్యాలెస్ నిజాం నవాబుల కాలంలో ప్రసిద్ధి చెందిన కట్టడం. ఇది ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో నిజాం వరకు ప్రధాన మంత్రులైన సాలార్ జంగ్‌ల నివాస గృహం. 1949లో సాలార్ జంగ్ మరణానంతరం ఈ అద్భుత కట్టడం వినియోగంలో లేకుండా పోయింది. చారిత్రకంగా ఎంతో పేరున్న ఈ కట్టడం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోగా, ఇటీవల కురిసిన వర్షానికి కమాన్ ముందు భాగం కొంత కూలింది. అయితే.. భవనం కమాన్ పూర్తిస్థాయిలో కూలకముందే ప్రమాదం అంచున ఉన్నప్పుడే మరమ్మతలు చేస్తారా?.. లేక కూల్చివేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అతి పురాతనమైన ఈ దివాన్ దేవిడి ప్యాలెస్‌లోని చత్తబజార్ టూ మదీనాకు వచ్చే మార్గంలో ఉన్న ఈ కమాన్ కింద ఉన్న ఓ బిర్యానీ సెంటర్ షాప్ ముందు కూలి కొంత భాగం పడడంతో అదే సమయంలో అక్కడ నుంచి బిర్యానీ తీసుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదాచారి మీద పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే ఇలాంటి పురాతన కట్టడాలు పాతబస్తీలో మరెన్నో ఉన్నాయి. ఒకప్పుడు నగరానికే తలమానికంగా వైభవం ప్రదర్శించిన ఇలాంటి కట్టడాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, వాటికి మరమ్మత్తులు చేయించి చారిత్రక ఆనవాళ్లను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..