Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌.. అధికారులతో సీఈసీ కీలక సమీక్ష..

Telangana Elections Notification: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఎలక్షన్‌ నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న తొలిరోజు పార్టీల ప్రతినిధులతో భేటీ అయిన కేంద్ర ఎన్నికల సంఘం.. పలు అంశాలపై మాట్లాడింది.

Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌.. అధికారులతో సీఈసీ కీలక సమీక్ష..
Telangana Elections

Updated on: Oct 04, 2023 | 12:28 PM

Telangana Elections Notification: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఎలక్షన్‌ నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న తొలిరోజు పార్టీల ప్రతినిధులతో భేటీ అయిన కేంద్ర ఎన్నికల సంఘం.. పలు అంశాలపై మాట్లాడింది. ఇవాళ 33 జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో సమావేశమయింది. ఈ సమావేశం ఉ.9:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలపై అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అలాగే రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని.. నోటిఫికేషన్ ఉంటుందని ఈసీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రజల్లో ఎన్నికలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌పై ప్రత్యేక వాకథాన్, సైక్లింగ్‌ కార్యక్రమాలను సీఈసీ ప్రారంభించారు.

తెలంగాణ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి కీలక సమీక్షలు నిర్వహిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఈ బృందం ఇప్పటికే.. రాజకీయ పార్టీలతో భేటీ అయింది. పది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి ముగ్గురు ప్రతినిధుల చొప్పున ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఒక్కో పార్టీతో విడివిడిగానూ చర్చించారు ఈసీ ప్రతినిధులు. ఈ సమావేశంలో ఆయా పార్టీలు తమ అభ్యంతారాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి.

తుది ఓటర్ల జాబితాపై సందిగ్ధత..

షెడ్యూల్ ప్రకారం ఈ రోజు తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తమని ఎన్నికల కమిషన్ గతంలో చెప్పింది. అయితే, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించిన తర్వాతే తుది ఓటర్ల జాబితా విడుదల చేయాలంటూ రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రకటన చేస్తారా లేదా..అనే సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 18 వరకు కొత్త ఓటర్ల నమోదుకు 13.06 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పేర్ల తొలగింపునకు 6.26 లక్షల దరఖాస్తులు, వివరాల సవరణ కోసం 7.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ వరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.13 కోట్లు.. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 14.72 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే, ఓటర్ లిస్టులో 3.39 లక్షల మందిని తొలగించారు. 10.95 లక్షలమంది ఓటర్ల వివరాలలో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్ల తుది జాబితా విడుదలపై సందిగ్ధత నెలకొంది.

ఇదిలాఉంటే.. మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. వరుస భేటీల అనంతరం.. నోటిఫికేషన్ పై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని.. దానికి సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దూకుడు పెంచాయి. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ.. మాటల తుటాలు పేలుస్తున్నాయి.

కాగా.. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తులు చేస్తున్నాయి. వడపోత తర్వాత త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..