Telangana projects receive Heavy Inflows: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు కుంటలు నిండుకుండల మారుతున్నాయి. భారీ వర్షాల వల్ల చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 7 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 7,980 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
నిర్మల్ జిల్లాలో గురువారం భారీ వర్షం కురవడంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 150 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదుకావడంతో చెరువులు మత్తడి పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ పట్టణంలో పలు కాలనీలు నీట మునిగాయి. సుమారు 300 మంది జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో గజఈతగాళ్లు, రెస్క్యూ టీంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నిజామాబాద్ జిల్లాలో పావెల్ దగ్గర గోదావరిలో చిక్కుకున్న ఏడుగురిని రక్షించారు రెస్క్యూ సిబ్బంది. ఎన్ డిఆర్‌ఎఫ్ టీమ్ వారిని రక్షించింది. 14 గంటల పాటు ఆశ్రమంలో చిక్కుకున్నారు ఏడుగురు బాధితులు. స్పీడ్ బోట్ల సాయంతో వారిని రక్షించారు. అటు, కామారెడ్డి జిల్లా లింగాయపల్లి వాగులో ఉధృతి పెరిగింది. అటు మొండివాగులో ఓ బైక్ కొట్టుకుపోయింది. దీంతో తండ్రీ కొడుకులను రక్షించారు స్థానికులు.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌లో వాగు ఉధృతి పెరిగింది. దీంతో సంగమేశ్వర వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. దీంతో తాడు సాయంతో 30 మంది ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు పోలీసులు. మెదక్ నుంచి కామారెడ్డికి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలతో ములుగు జిల్లాలోని బోగత జలపాతాలు ఉగ్రరూపం దాల్చాయి. భారీ వర్షాల కారణంగా బోగత జలపాతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదం పొంచిఉండడంతో అధికారులు సందర్శకులను అనుమతించడం లేదు.
గతకొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ మహానగర శివారులోని జంట జలాశయాలకు జలకళ వచ్చింది. ఇప్పటికే హిమాయత్‌సాగర్‌లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరడంతో రెండు రోజుల క్రితమే మూడు గేట్లను ఒకఫీటు మేర ఎత్తి నీటిని దిగువన మూసీ నదిలోకి వదులుతున్న అధికారులు గురువారం మరో రెండు గేట్లను ఎత్తారు. అటు, ఉస్మాన్‌సాగర్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానలతో ప్రస్తుతం 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. దీంతో రెండు గేట్లను ఒక ఫీటు వరకు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.