Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. ఉమ్మడి మెదక్, వరంగల్, రంగారెడ్డిజిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పలు జిల్లాలో పంటపొలాలు, ఇళ్లు నీట మునిగాయి. వాగులు పోటెత్తడంతో లోలెవెల్ వంతెనలు ప్రమాదకరంగా మారాయి.
నాగర్‌కర్నూలుజిల్లాలో దుంధుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మొల్గర గ్రామం దగ్గర వంతెన దాటుతూ ఓ కారు వరదనీటిలో ఇరుక్కుపోయింది. దాంతో స్థానికులు కారును సురక్షితంగా బయటకు లాగారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానలతో జూరాల ప్రాజెక్టు మళ్లీ నిండింది. అప్రమత్తమైన అధికారులు.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
నల్లగొండ ఉమ్మడి జిల్లాలో 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సుమారు 3 వేల చెరువులు పూర్తిగా నిండాయి. ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వంతెనపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.
ఇక మెదక్ జిల్లాలో భారీవర్షాలు కురిశాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వానలతో చెరువులు, కుంటలు నిండాయి. సిద్దిపేటలో అత్యధికంగా 8 సెంటిమీటర్ల వర్షం కురిసింది. మల్లారం పంస్‌హౌస్ లోకి వరదనీరు చేరింది. హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్ పరిధిలోని వందలాది గ్రామాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రామాయంపేట తహసీల్దార్ ఆఫీసులోకి వరదనీరు చేరింది. కొహెడ మండలంలోని మోయా తుమ్మెదవాగు.. కూడవెళ్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఓరుగల్లును వర్షం ముంచెత్తింది. కాలనీలను అతలాకుతలం చేసింది. జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. రహదారులు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. పలు ఇళ్లు ఇంకా నీటిలోనే ఉన్నాయి. భూపాలపల్లి, తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ బొగ్గుగనిలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ రికార్డు స్థాయిలో 14 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రధాన ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. చెరువులు, కుంటల నుంచి మత్తడి ప్రవహిస్తోంది. గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెనపై ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. ఖమ్మం జిల్లా పాలేరులోనూ భారీ వర్షాలు పడ్డాయి. పాలేరు జలాశయం నిండి అలుగు పారుతోంది. పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ వానలు కురిశాయి. వికారాబాద్ జిల్లాలో కోటిపల్లి, గాజీపూర్, సిద్దులూరు, డోర్నాల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Also read:
Assam Floods: అస్సాంను ముంచెత్తుతున్న వరదలు.. తినడానికి తిండి కూడా లేక జనం ఆర్తనాదాలు..
Capricorn: మకర రాశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియన ఆసక్తికరమైన విషయాలు.. మీకోసం..