
నిర్మల్ జిల్లాలో రైతుల బాధలు వర్ణనాతీతం. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తీరా చేతికొచ్చాక వర్షార్పణం అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచుతున్నాయి. దీంతో పంట కోసం చేసిన అప్పులు తీరే దారి లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
భైంసా మండలంలో అకాల వర్షాలకు చేతికొచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. భైంసా మండలం వాలేగామ్ లో అకాల వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యానికి మొలకలు వచ్చాయి. రెండు నెలలుగా కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో కల్లాల్లోనే వరి ధాన్యం పేరుకుపోయింది. కొనుగోళ్ల కేంద్రాల వద్ద లారీలు, గొనె సంచుల కొరత వేధిస్తోంది.
దీంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో కల్లాల్లోనే ధాన్యం కుప్పలుకుప్పలుగా పేరుకుపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద క్వింటాల్కు 10 కిలోల కోత పెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే నష్టాల పాలు కావల్సిందేనని లబోదిబోమంటున్నారు రైతులు.